China : భారత్‌పై డ్రాగన్ పంజా..మన ఈవీ పథకాలపై చైనా కుట్ర..డబ్ల్యూటీఓలో ఫిర్యాదు.

Update: 2026-01-21 07:00 GMT

China : భారతదేశం తన సొంత కాళ్లపై నిలబడాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాలు ఇప్పుడు చైనాకు పెద్ద తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీల తయారీలో భారత్ ఇస్తున్న సబ్సిడీలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చైనా ఆరోపిస్తోంది. ఈ వివాదంపై గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ, ఎటువంటి పరిష్కారం లభించలేదు. దీంతో చైనా ఇప్పుడు ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక వివాద పరిష్కార ప్యానెల్ ఏర్పాటు చేయాలని డబ్ల్యూటీఓను కోరింది.

చైనా ప్రధాన అభ్యంతరం ఏమిటంటే.. భారత్ తన దేశీయ కంపెనీలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు విదేశీ ఉత్పత్తుల పట్ల వివక్ష చూపుతున్నాయని. అంటే భారత దేశంలో తయారైన వస్తువులను వాడితేనే రాయితీలు ఇస్తామనే నిబంధనలు డబ్ల్యూటీఓ లోని గ్యాట్ (GATT 1994), ట్రిమ్స్ (TRIMs) వంటి ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయని చైనా వాదిస్తోంది. భారత్ తన మార్కెట్‌ను చైనా కంపెనీలకు దక్కకుండా చేయడానికి ప్రభుత్వ సబ్సిడీల అస్త్రాన్ని వాడుతోందని డ్రాగన్ ఆరోపిస్తోంది. కానీ భారత్ మాత్రం తన దేశీయ ఉపాధిని పెంపొందించుకోవడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ఈ పథకాలు అత్యవసరమని స్పష్టం చేస్తోంది.

ఈ గొడవ వెనుక అసలు కారణం చైనా తన దేశంలో పేరుకుపోయిన ఎలక్ట్రిక్ కార్ల నిల్వలను ఎక్కడో ఒకచోట వదిలించుకోవాలని చూడటమే. చైనా కంపెనీలు ఇప్పటికే ఐరోపా మరియు అమెరికా మార్కెట్లలో భారీ టారిఫ్‌లను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు వాటి కన్ను భారత ఈవీ మార్కెట్‌పై పడింది. ఈ ఏడాది చైనా ఈవీ ఎగుమతులు 51 శాతం పెరిగినప్పటికీ, భారత్ లాంటి దేశాలు స్థానిక తయారీకి ప్రాధాన్యత ఇస్తుండటంతో చైనా పప్పులు ఉడకడం లేదు. 2024-25లో చైనా నుంచి భారత్‌కు దిగుమతులు ఏకంగా 113 బిలియన్ డాలర్లకు చేరాయి. దీనివల్ల మనకు భారీ వాణిజ్య లోటు ఏర్పడింది.

భారత్ తన వాదనను చాలా బలంగా వినిపిస్తోంది. మన పీఎల్ఐ పథకాలు ఏదో ఒక దేశాన్ని లక్ష్యంగా చేసుకుని చేసినవి కావని, ఇది మన దేశం పర్యావరణ లక్ష్యాల సాధనలో భాగమని చెబుతోంది. జనవరి 27న జెనీవాలో జరిగే డబ్ల్యూటీఓ భేటీలో ఈ అంశం చర్చకు రానుంది. ఒకవేళ చైనా ప్యానెల్ ఏర్పాటులో విజయం సాధిస్తే, భారత్ తన రాయితీ విధానాలను మార్చుకోవాల్సి వస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా, భారత ఈవీ మార్కెట్‌ను చేజిక్కించుకోవాలని చూస్తున్న డ్రాగన్ కుట్రలను మన దేశం ఎలా తిప్పికొడుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News