CHINA: డ్రాగన్ దందాకు భారత్ చెక్!
రేర్ ఎర్త్ సరఫరాలో 60-70% చైనాదే.. స్వయం స్వాలంబన దిశగా భారత్... మేకిన్ ఇండియా-గ్రీన్ ఇండియా లక్ష్యం
అమెరికా-చైనా వాణిజ్య సంబంధాల మధ్య నెలకొన్న అస్థిరత.. ప్రపంచ సరఫరా గొలుసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ వ్యవస్థలు, పునరుత్పత్తి శక్తి రంగాలు వంటి విభాగాల్లో కీలకంగా మారిన అరుదైన భూమి మూలకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వ్యూహాత్మక ప్రాధాన్యత పొందాయి. ఈ నేపథ్యంలో పొరుగు దేశం చైనాపై గల అధిక ఆధారాన్ని తగ్గించుకోవడం ఇప్పుడు అన్ని ప్రధాన దేశాల లక్ష్యంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ రేర్ ఎర్త్ మెటల్స్ మీద తీసుకుంటున్న కొత్త చర్యలు, పెట్టుబడులు, విధాన మార్పులు దేశ భద్రతా, ఆర్థిక, సాంకేతిక స్వావలంబన వైపు కీలకమైన అడుగులు వేస్తున్నాయి. భారత్ ప్రస్తుతం తన అరుదైన భూమి అయస్కాంతాల నిల్వలను నిర్మించుకునే దిశగా వేగంగా కదులుతోంది. దేశీయ ఉత్పత్తిని పెంచి, దిగుమతుల మూలాలను వైవిధ్యపరచేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా అనేక రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది కేంద్రం. కొత్త మైనింగ్ లైసెన్సులు జారీ చేయడం ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలకు ఉత్సాహం కల్పించే దిశగా అడుగులు వేసింది. అదేవిధంగా రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉత్పత్తి ను ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నాయి. దీని వల్ల భారత్లో విలువైన భూలోహ పరిశ్రమకు పెట్టుబడులు రావడానికి అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని రేర్ ఎర్త్ సరఫరాలో సుమారు 60 నుంచి 70 శాతం వాటా చైనాకే ఉంది. ఈ ఆధారాన్ని తగ్గించుకోవాలంటే భారతదేశం ద్వైపాక్షిక, బహుపాక్షిక భాగస్వామ్యాల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది.
జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలతో కలిసి క్రిటికల్ మినరల్స్ పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసి, మైనింగ్, ప్రాసెసింగ్ రంగాల్లో సాంకేతిక సహకారం పెంచుతోంది. ఇక స్వల్పకాలిక దిగుమతి అంతరాయాలను ఎదుర్కోవడానికి అత్యవసర నిధులు కేటాయించింది. తద్వారా సరఫరా గొలుసు నిరంతరాయంగా కొనసాగుతుంది. అయస్కాంతాల తయారీలో అరుదైన భూమి మూలకాలకు ప్రత్యామ్నాయాలు కనుగొనే ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. భారత్ లో అనేక శాస్త్రీయ సంస్థలు రేర్ ఎర్త్ ఫ్రీ మాగ్నెట్స్ అభివృద్ధి దిశగా పరిశోధనలు చేస్తున్నారు. ఇవి పూర్తిగా రేర్ ఎర్త్ మూలకాలపై ఆధారపడకపోయినా, తక్కువ శక్తివంతంగా ఉంటాయి. ఈ లోటును పూరించడానికి మోటార్ డిజైన్లో మార్పులు, అధిక శక్తిని నిలుపుకునే కొత్త పదార్థాల శోధన కొనసాగుతోంది. అలాగే, కొన్ని పరిశోధనలు భారీ రేర్ ఎర్త్ మూలకాల తొలగింపుపై కేంద్రీకృతమయ్యాయి, తద్వారా మోటార్ల రూపకల్పనలో తక్కువ మార్పులతోనే ఉత్పత్తి సాధ్యమవుతుంది. మరొక ఆసక్తికరమైన దిశగా శాశ్వత అయస్కాంతాల స్థానంలో విద్యుదయస్కాంతాల వినియోగం, ఇది ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు పూర్తిగా కొత్త మార్గాన్ని తెరవవచ్చు. ఈ పద్ధతి పర్యావరణ పరంగా కూడా మేలైనది, ఎందుకంటే రేర్ ఎర్త్ తవ్వకాలు పర్యావరణం దెబ్బతినే అవకాశాలను తగ్గిస్తాయి. ఆర్థిక, పర్యావరణ సమతుల్యత: భారతదేశం తీసుకుంటున్న ఈ చర్యలు కేవలం వాణిజ్యపరమైనవి మాత్రమే కావు. ఇవి స్థిరత్వం, ఆత్మనిర్భరత దిశగా పెద్ద అడుగులు అని చెప్పవచ్చు. అరుదైన భూమి మూలకాలను తవ్వడంలో పర్యావరణ దుష్ప్రభావాలను తగ్గిస్తూ, రీసైక్లింగ్, రీయూజ్ సాంకేతికతలను ప్రోత్సహిస్తోంది.