Flying Car : టెస్లా కంటే ముందే చైనా దూకుడు.. ఎగిరే కార్ల ట్రయల్ ప్రొడక్షన్ మొదలు పెట్టిన చైనా కంపెనీ.

Update: 2025-11-04 12:01 GMT

Flying Car : ప్రపంచ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకురాబోతున్న ఎగిరే కార్ల తయారీలో చైనా, ప్రపంచ దిగ్గజ సంస్థల కంటే ఒక అడుగు ముందుకేసింది. అమెరికన్ కంపెనీ టెస్లా ఇతర సంస్థలు తమ ఎగిరే కార్లను మార్కెట్‌లోకి తీసుకురావాలని యోచిస్తున్న తరుణంలోనే, చైనాకు చెందిన ఎక్స్‌పెక్ కంపెనీ అనుబంధ సంస్థ ఎక్స్‌పెక్ ఏరోహెచ్‌టీ ట్రయల్ ప్రొడక్షన్ ప్రారంభించి సంచలనం సృష్టించింది. ఈ కొత్త తరం రవాణా వ్యవస్థకు సంబంధించిన ఈ తయారీ కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్దది కావడం విశేషం.

ట్రాన్స్‌పోర్టేషన్ రంగంలో నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీగా పిలవబడుతున్న ఎగిరే కార్ల తయారీలో చైనా కంపెనీ ఎక్స్‌పెక్ ఏరోహెచ్‌టీ ముందంజలో ఉంది. చైనాలోని ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఎక్స్‌పెక్ ఎగిరే కార్ల విభాగమైన ఎక్స్‌పెక్ ఏరోహెచ్‌టీ, సోమవారం ప్రపంచంలోనే మొదటి స్మార్ట్ ఫ్యాక్టరీలో ఎగిరే కార్ల ట్రయల్ ప్రొడక్షన్ ప్రారంభించింది. ఇది ఈ టెక్నాలజీని వాణిజ్యపరంగా ఉపయోగించే దిశగా ఒక పెద్ద మైలురాయిగా భావించబడుతోంది.

గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని గ్వాంగ్‌జౌ నగరంలో ఉన్న ఈ ఫ్యాక్టరీ, ఇప్పటికే తమ లాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ అనే మాడ్యులర్ ఎగిరే కారు మొదటి డిటాచబుల్ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను తయారు చేసింది. ఎక్స్‌పెక్ ఏరోహెచ్‌టీ ఏర్పాటు చేసిన ఈ స్మార్ట్ ఫ్యాక్టరీ ప్రపంచంలోనే ఎగిరే కార్లను తయారు చేసే అతిపెద్ద కేంద్రంగా గుర్తింపు పొందింది. ఈ ఫ్యాక్టరీ సుమారు 1,20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు.

ఈ ప్లాంట్ ఏటా 10,000 ఎగిరే ఎయిర్‌క్రాఫ్ట్ మాడ్యూల్స్‌ను తయారు చేసే సామర్థ్యంతో రూపొందించబడింది. ప్రారంభ దశలో ఇది 5,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత, ఈ ఫ్యాక్టరీలో ప్రతి 30 నిమిషాలకు ఒక ఎగిరే ఎయిర్‌క్రాఫ్ట్ మాడ్యూల్ తయారవుతుందని నివేదికలు చెబుతున్నాయి. టెస్లా సహా ఇతర అమెరికన్ కంపెనీలు ఎగిరే కార్లను తీసుకురావాలని ఆసక్తి చూపుతున్నప్పటికీ, చైనా మాత్రం ట్రయల్ ప్రొడక్షన్ ప్రారంభించి వాటిని వెనుకకు నెట్టింది.

టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ గతంలో ఒక అమెరికన్ ఛానల్‌తో మాట్లాడుతూ.. తమ ఎగిరే కారు లాంచ్ ఇప్పటివరకు అత్యంత గుర్తుండిపోయే ఉత్పత్తి ఆవిష్కరణ అవుతుందని చెప్పారు. ఈ కారును రాబోయే కొన్ని నెలల్లో ప్రవేశపెట్టవచ్చని కూడా ఆయన సూచించారు. టెస్లా మాత్రమే కాక, మరొక అమెరికన్ కంపెనీ అలెఫ్ ఏరోనాటిక్స్ కూడా తమ ఎగిరే కారు టెస్ట్ రన్ పూర్తి చేసి, త్వరలోనే వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రకటించింది. అయినప్పటికీ ఎక్స్‌పెక్ ఏరోహెచ్‌టీ ట్రయల్ ప్రొడక్షన్‌ను మొదలు పెట్టడం ద్వారా టెస్లా కంటే ఒక అడుగు ముందే ఉంది.

Tags:    

Similar News