Central Excise Bill 2025 : ఇక భారీగా పెరగనున్న సిగరెట్, పాన్ మసాలా ధరలు..పొగాకు ఉత్పత్తులపై కొత్త పన్ను.

Update: 2025-12-04 06:24 GMT

Central Excise Bill 2025 : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం లోక్‌సభలో సెంట్రల్ ఎక్సైజ్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2025 ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లు పాస్ కావడంతో త్వరలో ఇది రాజ్యసభకు వెళ్లనుంది. ఈ బిల్లు ప్రధానంగా పొగాకు, దానికి సంబంధించిన ఉత్పత్తులైన సిగరెట్, నమిలే పొగాకు, హుక్కా, జర్దా వంటి వాటిపై ఎక్సైజ్ డ్యూటీని పెంచాలని ప్రతిపాదిస్తోంది. ఈ పెంపుదల వల్ల ఈ ఉత్పత్తుల ధరలు పెరిగి, వాటి వినియోగం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ బిల్లు ఎందుకు తీసుకువచ్చారు?

ఈ బిల్లు తీసుకురావడానికి ముఖ్య కారణం జీఎస్టీ పరిహార సెస్ గడువు ముగియడమే. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలకు పరిహారం ఇవ్వడానికి పొగాకు ఉత్పత్తులపై తాత్కాలిక సెస్ విధించారు. ఆ సెస్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ వస్తువులపై పన్ను తగ్గిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ కొత్త ఎక్సైజ్ డ్యూటీని విధించాలని నిర్ణయించింది. పొగాకు వంటి సిన్ గూడ్స్ పై పన్ను పెంచడం ద్వారా వాటి వినియోగాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉత్పత్తులు చవకగా ఉండకూడదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

ఏ ఉత్పత్తులపై ఎంత ప్రభావం?

జీఎస్టీ పరిహార సెస్ స్థానంలో కొత్తగా ఎక్సైజ్ డ్యూటీ విధించడం ద్వారా ఈ కింది ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. పొడవు ఆధారంగా సిగరెట్/సిగార్/చురూట్ పై ప్రతి 1000 స్టిక్స్‌ మీద రూ.5,000 నుంచి రూ.11,000 వరకు డ్యూటీ. నమిలే పొగాకు డ్యూటీ రెట్టింపు కంటే ఎక్కువగా పెరుగుతుంది. ముడి పొగాకు పై 60-70% ఉత్పత్తి సుంకం పెరుగుతుంది. హుక్కా పొగాకు పై 40% వరకు సుంకం, పాన్ మసాలా, జర్దా వంటి ఇతర అనుబంధ ఉత్పత్తులపై కూడా కొత్త డ్యూటీ లేదా సెస్ విధించబడుతుంది.

ఈ కొత్త ఎక్సైజ్ డ్యూటీ ద్వారా ప్రభుత్వానికి అధిక ఆదాయం లభిస్తుంది. ఈ ఆదాయాన్ని ప్రజల ఆరోగ్యం, జాతీయ భద్రత వంటి కీలక రంగాలపై ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కొత్త ఉత్పత్తి సుంకం అనేది డివిజిబుల్ పూల్లోకి వెళ్తుందని, దీని ద్వారా కేంద్రం మాత్రమే కాక రాష్ట్రాలకు కూడా లబ్ధి చేకూరుతుందని ఆర్థిక మంత్రి సీతారామన్ లోక్‌సభలో వివరించారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం పొగాకు ఉత్పత్తులపై రిటైల్ ధరలో 75% పన్ను భారం ఉండాలని తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో ఇది 53% మాత్రమే ఉందని ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాలలో ఈ పన్ను రేటు 80% నుంచి 85% వరకు ఉందని ఆమె గుర్తు చేశారు. అందువల్ల సిగరెట్లు ఇకపై చవకగా ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. ఈ బిల్లుకు ప్రతిపక్షం నుంచి కూడా మద్దతు లభించింది. అయితే, చిన్న వ్యాపారులు, పొగాకు రైతుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Tags:    

Similar News