Coal Demand : షాకింగ్ రిపోర్ట్.. 2050 నాటికి రెట్టింపు కానున్న బొగ్గు వాడకం.
Coal Demand : మనం పర్యావరణం గురించి ఎంతగా మాట్లాడుకున్నా, క్లీన్ ఎనర్జీ (సౌర, పవన విద్యుత్) వైపు ఎంత వేగంగా అడుగులు వేస్తున్నా.. రాబోయే మూడు దశాబ్దాల పాటు భారతదేశానికి బొగ్గు ప్రాధాన్యత తగ్గదని నీతి ఆయోగ్ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. 2050వ సంవత్సరం నాటికి దేశంలో బొగ్గు వినియోగం ప్రస్తుతం ఉన్నదాని కంటే రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ఈ ప్రభుత్వ థింక్ ట్యాంక్ అంచనా వేసింది. ప్రస్తుత విధానాల ప్రకారం చూస్తే, 2050 నాటికి బొగ్గు డిమాండ్ ఏకంగా 2.62 బిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం మన వినియోగం కేవలం 1.26 బిలియన్ టన్నులు మాత్రమే.
భారతదేశం 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం నెరవేరాలంటే, 2050 నాటికి బొగ్గు వినియోగాన్ని 1.83 బిలియన్ టన్నుల వద్దే కట్టడి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అది క్రమంగా తగ్గుతూ 2070 నాటికి 161 మిలియన్ టన్నులకు పడిపోవాలి. అప్పుడు కూడా స్టీల్, సిమెంట్ వంటి భారీ పరిశ్రమలకు బొగ్గు వాడకం తప్పదని, అయితే ఆ సమయంలో వెలువడే కాలుష్యాన్ని నియంత్రించడానికి కార్బన్ క్యాప్చర్ వంటి అత్యాధునిక సాంకేతికతను వాడాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది.
ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బొగ్గు వినియోగించే దేశం భారతే. మన దేశ విద్యుత్ అవసరాల్లో మూడొంతులు బొగ్గు ఆధారిత ప్లాంట్ల నుంచే వస్తోంది. పెరగబోయే విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడానికి 2035 నాటికి థర్మల్ పవర్ కెపాసిటీని 212 గిగావాట్ల నుంచి 307 గిగావాట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సోలార్, విండ్ పవర్ ఎంత పెరిగినా, గ్రిడ్ స్థిరంగా ఉండాలంటే బొగ్గు నుంచి వచ్చే నిరంతర విద్యుత్ మనకు రక్షణ కవచంలా పనిచేస్తుందని నీతి ఆయోగ్ హెచ్చరించింది.
బొగ్గు వాడకాన్ని తగ్గించాలంటే కేవలం సోలార్ ప్యానెల్స్ పెడితే సరిపోదు. భారీ స్థాయిలో బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు, అణు విద్యుత్ కేంద్రాల విస్తరణ, గ్రిడ్ ఆధునీకరణ వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలి. అప్పుడే మనం బొగ్గుపై ఆధారపడటం తగ్గించగలం. భవిష్యత్తులో బొగ్గు ప్లాంట్లు ఉన్నా కూడా, అవి రోజంతా కాకుండా కేవలం పీక్ అవర్స్ (ఎక్కువ డిమాండ్ ఉన్న సమయం)లో లేదా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పని చేసేలా మార్పులు చేయాల్సి ఉంటుంది.