Financial Mistakes: డబ్బు విషయంలో ఈ 7 తప్పులు చేస్తున్నారా? FD, గోల్డ్, ఇన్సూరెన్స్ గురించి మీకున్న అపోహలు ఇవే
Financial Mistakes: మన జీవితాన్ని సజావుగా నడపడానికి డబ్బు చాలా ముఖ్యం. చాలా మంది బాగానే సంపాదిస్తారు, కానీ ఏళ్లు గడిచే కొద్దీ వారి సంపద వారు అనుకున్నంతగా పెరగదు. మరికొందరైతే రిటైర్మెంట్ సమయానికి అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఉన్న ఆస్తిని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సాధారణంగా ప్రజలు ఆర్థిక విషయాలలో కొన్ని పక్షపాతంతో కూడిన, తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉండటమే దీనికి ప్రధాన కారణం. ప్రజలు డబ్బు విషయంలో చేసే ప్రధాన తప్పిదాలు, అపోహలు ఏమిటో చూద్దాం.
1. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో డబ్బు ఉంచితే సరిపోతుందా?
నేటికీ చాలా మంది తమ పొదుపు మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్‌లలో ఉంచడానికి మొగ్గు చూపుతారు. ఎఫ్‌డీలలో కేవలం 6-7 శాతం మాత్రమే వడ్డీ లభిస్తుంది. అయితే ద్రవ్యోల్బణం రేటు 5% కంటే ఎక్కువగా ఉన్నందున, ఎఫ్‌డీల ద్వారా వచ్చే రాబడిలో నిజమైన విలువ పెద్దగా పెరగదు. కాబట్టి నిపుణుల సలహా ఏంటంటే, మీ పొదుపు మొత్తంలో ఒక భాగాన్ని మాత్రమే ఎఫ్‌డీలలో ఉంచడం ఉత్తమం. మిగతా మొత్తాన్ని మంచి రాబడినిచ్చే పెట్టుబడి సాధనాల్లో పెట్టాలి.
2. అప్పు తీసుకోవడం ఎప్పుడూ చెడ్డదేనా?
కొంతమంది అప్పు అంటేనే దూరంగా పారిపోతారు. కానీ, రుణాలలో మంచి రుణం, చెడ్డ రుణం అని వర్గీకరించవచ్చు. తక్కువ వడ్డీకి లభించే గోల్డ్ లోన్, హోమ్ లోన్ వంటివి మంచి అప్పుల కిందకి వస్తాయి. అలాగే, మీరు తీసుకున్న అప్పును ఏదైనా వ్యాపారానికి లేదా ఆదాయాన్ని పెంచే పనికి ఉపయోగిస్తే అది కూడా మంచి అప్పే అవుతుంది. అదే అధిక వడ్డీకి లభించే వ్యక్తిగత రుణాలు లేదా అనవసరమైన, విలాసవంతమైన వస్తువుల కోసం తీసుకునే రుణాలు చెడ్డ అప్పులుగా పరిగణించాలి.
3. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం పెట్టుబడి అవుతుందా?
తమ పొదుపులో కొంత భాగాన్ని బంగారు ఆభరణాలలో పెట్టుబడి పెట్టామని చాలా మంది అనుకుంటారు. కానీ, ఆభరణాల కొనుగోలు పెట్టుబడి కాదు. అలంకరణకు ఇష్టపడితేనే ఆభరణాలను కొనాలి. పెట్టుబడి కోసం ఆభరణాలు కొంటే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వాటిపై తయారీ ఛార్జీలు, వేస్టేజ్ ఛార్జీలు వంటివి ఉంటాయి. తిరిగి అమ్మేటప్పుడు కూడా బంగారం కొంత పోతుంది. కాబట్టి, పెట్టుబడి కోసం సావరిన్ గోల్డ్ బాండ్స్ లేదా గోల్డ్ ఈటీఎఫ్‌లను ఎంచుకోవడం తెలివైన పని.
4. స్టాక్ మార్కెట్ జూదమా?
చాలా మంది స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి భయపడతారు. అందులో డబ్బు ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో తెలియదని, అదొక జూదం అని తప్పుగా భావిస్తారు. కానీ పెట్టుబడి పెట్టడానికి ముందు కొంతవరకూ ఆర్థిక పరిజ్ఞానం పొందితే, ఎవరైనా స్టాక్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికంగా చూస్తే, స్టాక్ మార్కెట్ మంచి రాబడినిచ్చే సాధనం.
5. ఇన్సూరెన్స్ ఒక పెట్టుబడి మార్గమా?
కొంతమంది ఇన్సూరెన్స్‌ను లైఫ్ ప్రొటెక్షన్, పెట్టుబడి అనే రెండు ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇది పూర్తిగా తప్పు. ఇన్సూరెన్స్ అనేది ప్రధానంగా మీకు లైఫ్ ప్రొటెక్షన్‌ను ఇచ్చే ఉత్పత్తి మాత్రమే. పెట్టుబడి కోసం వేరే ఆర్థిక సాధనాలను ఎంచుకోవడమే తెలివైన పని. ఇన్సూరెన్స్‌లో మీరు పెట్టిన డబ్బు వార్షికంగా కేవలం 4-5 శాతం మాత్రమే పెరుగుతుంది. దాని ద్వారా పెద్దగా రాబడి ఉండదని గుర్తుంచుకోవాలి. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సరిపోతుంది.
6. డబ్బు పొదుపు చేస్తే సరిపోతుందా?
ధనవంతులు కావడానికి మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి.. డబ్బు సంపాదించడం, డబ్బు ఆదా చేయడం, డబ్బు పెట్టుబడి పెట్టడం. ఈ మూడు ఉంటేనే సంపదను సాధించడం సాధ్యమవుతుంది. కొందరు అన్ని ఖర్చులను తగ్గించి, కేవలం డబ్బు పొదుపు చేయడంపైనే దృష్టి పెడతారు. అలా పొదుపు చేసిన డబ్బును ఎక్కడ పెట్టకుండా వదిలేస్తే, ద్రవ్యోల్బణం కారణంగా దాని నిజమైన విలువ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి, ఆదా చేసిన డబ్బును మంచి రాబడినిచ్చే పెట్టుబడి సాధనాల్లో తప్పకుండా పెట్టాలి.
7. ఇప్పుడే కాదు, తర్వాత పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారా?
చాలా మంది పెట్టుబడి పెట్టడానికి మీనమేషాలు లెక్కిస్తారు. తమకు ఉన్న ఆర్థిక సమస్యలు తీరితే పెట్టుబడి పెడతామని ప్రతి సంవత్సరం అనుకుంటూ ఉంటారు. కానీ, వారి సమస్యలు ఎప్పటికీ తీరవు, పెట్టుబడి పెట్టడం జరగదు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే? ఎంత తక్కువ మొత్తంలోనైనా సరే, ఇప్పుడే పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. ఆ తర్వాత నెమ్మదిగా పెట్టుబడి మొత్తాన్ని పెంచుకుంటూ పోవచ్చు. అప్పుడు మీ ఇతర ఆర్థిక సమస్యలు కూడా దానంతట అవే సర్దుకుంటాయి.