గత నాలుగేళ్లలో గృహ నిర్మాణ ప్రాజెక్టుల సగటు నిర్మాణ వ్యయం 39 శాతం పెరిగిందని స్థిరాస్తి కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా తన నివేదికలో వెల్లడించింది. 2024 అక్టోబరులో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.2,780కి చేరిందని తెలిపింది. 2020 అక్టోబరులో చదరపు అడుగుకు నిర్మాణ వ్యయం రూ.2,000 ఉండగా, 2021 అక్టోబరులో రూ.2,200, 2022 అక్టోబరులో 2,300, 2023 అక్టోబరులో 2,500కు చేరిందని వివరించింది. ముఖ్యంగా భవన నిర్మాణ సామగ్రి, నైపుణ్యం గల మానవ వనరులు ఖరీదయ్యాయని పేర్కొంది. ప్రథమ శ్రేణి (టైర్-1) నగరాల్లోని 15 అంతస్తుల గ్రేడ్ ఏ నివాస భవనానికి సంబంధించి ఇది సగటు ఖర్చని తెలిపింది. గతేడాది నుంచి ఇసుక, ఇటుక, గాజు, కలప, రాగి, అల్యూమినియం మొదలైన నిర్మాణ సామగ్రిలో ధరల పెరుగుదలతో పాటు కూలీల ఖర్చులు పెరగడంతో గృహ నిర్మాణ ప్రాజెక్టుల వ్యయం 11% పెరిగిందని నివేదిక వివరించింది. సిమెంట్ ధరలు 15%, ఉక్కు ధర 1% తగ్గినప్పటికీ, గత ఏడాది నుంచి కూలీల వ్యయాలు 25 శాతం మేర పెరగడంతో నిర్మాణ వ్యయం బాగా పెరిగిందని కొలియర్స్ ఇండియా తెలిపింది. రాగి, అల్యూమినియం సగటు ధరలు వరుసగా 19 శాతం, 5 శాతం మేర పెరిగాయని వెల్లడించింది.