Petrol Diesel Prices : యుద్ధం ముదిరినా పెట్రోల్ పెరగదా? ఎన్నికల వేళ కేంద్రం మాస్టర్ ప్లాన్.

Update: 2026-03-03 06:45 GMT

Petrol Diesel Prices : మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సెగలు రేగుతున్నాయి. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. దానికి ప్రతిగా ఇరాన్ జరిపిన ప్రతిదాడులతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 9 శాతం మేర ఎగబాకాయి. ఈ పరిణామం భారత వాహనదారుల్లో గుబులు రేపుతోంది. ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటితే, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్ళీ ఆకాశాన్ని తాకుతాయనే ప్రచారం మొదలైంది. అయితే సామాన్య ప్రజలకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని కీలక సంకేతాలు అందుతున్నాయి.

ప్రస్తుతం గల్ఫ్ దేశాల బ్రెంట్ క్రూడ్ ధర 80 డాలర్ల మార్కుకు చేరుకోగా, అమెరికన్ క్రూడ్ ఆయిల్ ధర 72.79 డాలర్లకు పెరిగింది. మన దేశ చమురు అవసరాల్లో దాదాపు 88 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగితే మన దిగుమతి ఖర్చులు పెరిగి, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పడుతుంది. కానీ, ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం చమురు కంపెనీలు అనుసరిస్తున్న బ్యాలెన్సింగ్ పాలసీ. అంతర్జాతీయ ధరలు తగ్గినప్పుడు లాభాలు గడించే కంపెనీలు, ధరలు పెరిగినప్పుడు ఆ భారాన్ని తామే భరిస్తూ వినియోగదారులపై పడకుండా చూస్తున్నాయి. 2022 ఏప్రిల్ నుంచి దేశంలో ఇంధన ధరలు దాదాపు స్థిరంగా ఉండటానికి ఇదే కారణం.

మరోవైపు, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం వంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో, ప్రభుత్వం ఇంధన ధరలు పెంచి విపక్షాలకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోమవారం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి, దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ నిల్వలపై సమీక్ష జరిపారు. "పరిస్థితిని మేం నిశితంగా గమనిస్తున్నాం. ప్రజలకు ఇంధన లభ్యతలో ఇబ్బంది కలగకుండా, ధరలు అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటాం" అని మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చింది.

అయితే, ఇక్కడ అసలు చిక్కు హోర్ముజ్ జలసంధి వద్ద ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఇరాన్ ఈ జలసంధిని మూసివేశామని హెచ్చరిస్తోంది. భారత్‌కు వచ్చే సగం ముడి చమురు ఈ ఇరుకైన మార్గం గుండానే రావాలి. ఒకవేళ రవాణా నిలిచిపోతే సరఫరా గొలుసు దెబ్బతింటుంది. ఇప్పటికే బీమా కంపెనీలు చమురు ట్యాంకర్లకు ఇన్సూరెన్స్ కవరేజీని వెనక్కి తీసుకోవడంతో రాకపోకలు మందగించాయి. అయినప్పటికీ, భారత్ వద్ద తగినంత చమురు నిల్వలు ఉన్నాయని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దిగుమతులు చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాచారం. యుద్ధం ముదిరితే తప్ప, తక్షణమే పెట్రోల్ ధరలు పెరిగే ఛాన్స్ లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News