Market Holiday : స్టాక్ మార్కెట్‌కు హోలీ సెలవు.. నేడు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ట్రేడింగ్ బంద్.

Update: 2026-03-03 06:30 GMT

Market Holiday : స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు గమనిక.. రంగుల పండుగ హోలీ సందర్భంగా నేడు (మార్చి 3, మంగళవారం) దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‎లలో ఎలాంటి ట్రేడింగ్ జరగదు. దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు రేపు (మార్చి 4) జరగాల్సి ఉన్నప్పటికీ, ఎక్స్ఛేంజీలు మాత్రం మంగళవారమే సెలవును ఖరారు చేశాయి. కేవలం ఈక్విటీ మార్కెట్లే కాకుండా, కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్ కూడా నేడు పనిచేయదు.

ఇక కమోడిటీ మార్కెట్ల విషయానికి వస్తే.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఉదయం సెషన్‌లో (9:00 AM నుంచి 5:00 PM వరకు) మూసి ఉంటుంది. అయితే, సాయంత్రం సెషన్‌లో రాత్రి 11:30 వరకు యథావిధిగా ట్రేడింగ్ జరుగుతుంది. మరోవైపు నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ మాత్రం రెండు సెషన్లలోనూ మూతపడే ఉంటుంది. మార్చి నెలలోనే మరిన్ని సెలవులు కూడా ఉన్నాయి. మార్చి 26న శ్రీరామ నవమి, మార్చి 31న శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లు పనిచేయవు.

స్టాక్ మార్కెట్ సెలవుల క్యాలెండర్ 2026 ప్రకారం.. ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, మే 1న మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా సెలవులు ఉన్నాయి. ఏడాది ద్వితీయార్థంలో జూన్ 26న మొహర్రం, సెప్టెంబర్ 14న వినాయక చవితి, అక్టోబర్ 2న గాంధీ జయంతికి మార్కెట్లు బంద్ ఉంటాయి. అక్టోబర్ 20న దసరా, నవంబర్ 10న దీపావళి బలిప్రతిపద, నవంబర్ 24న గురునానక్ జయంతి సెలవులు ఉన్నాయి. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న చివరి సెలవు ఉంటుంది. ఆశ్చర్యకరంగా ఈసారి దీపావళి ఆదివారం (నవంబర్ 8) రావడంతో ప్రత్యేకంగా సెలవు జాబితాలో చేర్చలేదు. అయితే ఆ రోజు ముహూరత్ ట్రేడింగ్ సమయాన్ని ఎక్స్ఛేంజీలు తర్వాత ప్రకటిస్తాయి.

ప్రస్తుతం మార్కెట్ పరిస్థితిని చూస్తే ఇన్వెస్టర్లలో ఆందోళన కనిపిస్తోంది. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న యుద్ధ మేఘాల కారణంగా గత రెండు రోజులుగా సెన్సెక్స్, నిఫ్టీలు కుప్పకూలాయి. సోమవారం ఒక్కరోజే సెన్సెక్స్ 1,048 పాయింట్లు పతనమవ్వగా, నిఫ్టీ 313 పాయింట్లు కోల్పోయింది. ఈ భారీ పతనం వల్ల ఇన్వెస్టర్ల సొమ్ము దాదాపు రూ.6.59 లక్షల కోట్లు ఆవిరైపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల విక్రయాల వల్ల మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోంది. నేడు సెలవు కావడంతో ఇన్వెస్టర్లకు ఈ ఒత్తిడి నుంచి కాస్త విరామం దొరికినట్లయింది.

Tags:    

Similar News