గోల్డ్ పై కస్టమ్స్ ట్యాక్స్ భారీగా తగ్గించడం, పండగ సీజన్ వేళ పెరిగిన డిమాండ్ కారణంగా మన దేశ బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఆగస్టులో దిగమతులు డబుల్ అయ్యాయి. గతేడాది ఆగస్టులో 4.83 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకోగా.. ఈ ఏడాది 10.06 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. భారీ స్థాయిలో దిగుమతులు పెరగడంపై వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భత్వాల్ మాట్లాడుతూ.. కస్టమ్స్ ట్యాక్స్ తగ్గించడం వల్లే దిగుమతులు పెరిగాయని పేర్కొన్నారు. స్మగ్లింగ్, ఇతర కార్యకలాపాలు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. అలాగే, పండగల సీజన్ కావడంతో పెద్ద మొత్తం నగలను వ్యాపారులు సిద్ధం చేస్తుంటారని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్ ట్యాక్స్ ను 15 శాతం నుంచి 6 శాతానికి కేంద్రం తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా తర్వాతి స్థానంలో భారత్ నిలుస్తోంది. మన దేశ దిగుమతుల్లో 40 శాతం గోల్డ్ వాటా స్విట్జర్లాండ్‌దే. 16 శాతంతో యూఏఈ, 10 శాతంతో దక్షిణాఫ్రికా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
దేశంలో ఈ ఏడాది నుంచి ఆగస్టు వరకు 22.70 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతులు పెరిగాయి. బంగారం దిగుమతులు పెరగడానికి ప్రధాన కారణం.. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, పండుగ సీజన్ మాత్రమే కాకుండా కస్టమ్స్ ట్యాక్స్ తగ్గించడమని తెలుస్తోంది. 2024 మొదటి త్రైమాసికం కంటే.. రెండో త్రైమాసికంలోనే బంగారం దిగుమతులు పెరిగాయని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. సెమీ అర్బన్, గ్రామీణ మార్కెట్ కూడా పెరిగింది. మొత్తం మీద ఈ ఏడాది దేశంలో బంగారం డిమాండ్ 850 టన్నులకు చేరుకుంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది.