DA Hike 2026: కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్..జనవరి నుంచి జీతాల్లో భారీ పెరుగుదల.
DA Hike 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త ఏడాది అదిరిపోయే వార్త అందబోతోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా ఇచ్చే డీఏ జనవరి 2026 నుంచి పెరగనుంది. దీనికి సంబంధించి కీలకమైన గణాంకాలు విడుదలయ్యాయి. దీంతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన మార్పులు రాబోతున్నాయి. అటు 8వ వేతన సంఘం ఊహాగానాలు కూడా ఈసారి డీఏ పెంపుపై ఆసక్తిని పెంచుతున్నాయి.
కేంద్ర కార్మిక శాఖ తాజాగా నవంబర్ 2025 నెలకు సంబంధించిన అఖిల భారత పారిశ్రామిక కార్మికుల ధరల సూచీని విడుదల చేసింది. ఈ సూచీ 148.2 పాయింట్లుగా నమోదైంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో రెండుసార్లు డీఏను సవరిస్తుంది. గత జూలై 2025లో డీఏను 54 శాతం నుంచి 58 శాతానికి పెంచారు. ఇప్పుడు నవంబర్ గణాంకాలను బట్టి చూస్తే, ఈసారి డీఏ 3 నుంచి 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి.
డీఏ పెంపు వల్ల జీతంలో వచ్చే మార్పును ఒక ఉదాహరణతో చూద్దాం. ఒక ఉద్యోగి కనీస వేతనం రూ.50,000 అనుకుంటే..ప్రస్తుతం (58% DA) నెలకు రూ.29,000 డీఏ వస్తుంది. 3% పెరిగితే (61% DA) డీఏ రూ.30,500 అవుతుంది. అంటే నెలకు రూ. 1,500 అదనపు లాభం. 5% పెరిగితే (63% DA) డీఏ రూ.31,500 అవుతుంది. అంటే నెలకు రూ.2,500 చొప్పున ఏడాదికి సుమారు రూ.30,000 వరకు అదనంగా అందుతాయి. ఇలా బేసిక్ జీతం పెరిగే కొద్దీ డీఏ రూపంలో వచ్చే లాభం కూడా వేలల్లో పెరుగుతుంది.
డిసెంబర్ 2025 నెలకు సంబంధించిన ధరల సూచీ జనవరి చివరలో వస్తుంది. దాని ఆధారంగానే తుది పెంపు ఎంత అనేది కేంద్ర మంత్రిమండలి నిర్ణయిస్తుంది. సాధారణంగా జనవరి నుంచి అమలు కావాల్సిన డీఏ పెంపు ప్రకటనను కేంద్ర ప్రభుత్వం మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వెలువరిస్తుంది. అయితే, అప్పటివరకు పెరిగిన మొత్తాన్ని బకాయిల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుంది.
మరోవైపు 7వ వేతన సంఘం గడువు డిసెంబర్ 31, 2025తో ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి 8వ వేతన సంఘం పైనే ఉంది. ఈ కమిషన్ ఏర్పాటైన తర్వాత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పై సిఫార్సులు అందజేస్తుంది. దీని ప్రకారం కొత్త బేసిక్ శాలరీ ఖరారవుతుంది. ఆ సమయంలో అప్పటివరకు ఉన్న డీఏను సున్నా చేసి, దానిని బేసిక్ శాలరీలో కలిపివేస్తారు. అయితే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న తరుణంలో డీఏను పూర్తిగా తొలగించకుండా, ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడే విధంగా కొత్త విధానం ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.