External Debt : అభివృద్ధి చెందుతున్న దేశాలపై రుణ సంక్షోభం.. రూ.11.4ట్రిలియన్ డాలర్లు దాటిన అప్పు.
External Debt : అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రమైన రుణ సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. 2023 నాటికి ఈ దేశాల విదేశీ రుణాలు గత రెండు దశాబ్దాల్లో నాలుగు రెట్లు పెరిగి, రికార్డు స్థాయిలో 11.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది వాటి ఎగుమతి ఆదాయంలో 99% కావడం ఆందోళన కలిగిస్తోంది. అభివృద్ధి ప్రాజెక్టులకు అప్పులు పెంచడం, వస్తువుల ధరల అస్థిరత, పెరుగుతున్న ప్రభుత్వ లోటు వంటి అంశాలు ఈ రుణ భారాన్ని పెంచాయి. కోవిడ్-19 మహమ్మారి ఆర్థిక నష్టాలను పూడ్చుకోవడానికి, ప్రజారోగ్య చర్యల కోసం భారీగా అప్పులు చేయడంతో పరిస్థితి మరింత దిగజారిందని యూఎన్ నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం మూడింట రెండు వంతుల అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF)కు అర్హత పొందిన 68 తక్కువ-ఆదాయ దేశాలలో సగానికి పైగా ఇప్పుడు రుణ సంక్షోభంలో చిక్కుకున్నాయి. 2023లో ఈ దేశాలు 847 బిలియన్ డాలర్ల నికర వడ్డీని చెల్లించాయి. అధిక వడ్డీ రేట్లతో ఇవి యునైటెడ్ స్టేట్స్ కంటే రెండు నుండి నాలుగు రెట్లు ఎక్కువ, జర్మనీ కంటే ఆరు నుండి 12 రెట్లు ఎక్కువ వడ్డీ రేట్లపై అప్పులు చేస్తున్నాయి.
ప్రభుత్వాలు ప్రజా సేవలు, పెట్టుబడుల కంటే రుణ చెల్లింపులకే ప్రాధాన్యత ఇవ్వవలసి వస్తోంది. దీని వల్ల పాఠశాలలు, ఆసుపత్రులు, మౌలిక సదుపాయాలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. అనేక దేశాలు తమ అప్పులను చెల్లించకపోయినా, అభివృద్ధి లక్ష్యాలు, వాతావరణ చర్యలను త్యాగం చేయడం ద్వారా అభివృద్ధిలో డిఫాల్ట్ అవుతున్నాయి. 2023లో 54 దేశాలు, వాటిలో దాదాపు సగం ఆఫ్రికాలో ఉన్నాయి. తమ ప్రభుత్వ నిధులలో కనీసం 10% రుణ వడ్డీ చెల్లింపుల కోసం కేటాయించాయి. ప్రస్తుతం 3.3 బిలియన్ల మంది ప్రజలు ఆరోగ్యం లేదా విద్యపై ఖర్చు చేయడం కంటే రుణ చెల్లింపులపై ఎక్కువ ఖర్చు చేసే దేశాలలో నివసిస్తున్నారు.
ఈ రుణ సంక్షోభానికి కారణాలను పరిశోధించడానికి, పరిష్కారాలను అన్వేషించడానికి యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్(UNCTAD) ఇటీవల జెనీవాలో 14వ అంతర్జాతీయ రుణ నిర్వహణ కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది. ఈ కాన్ఫరెన్స్‌లో UNCTAD తన అత్యాధునిక రుణ నిర్వహణ సాఫ్ట్‌వేర్ DMFAS 7ను కూడా ప్రారంభించింది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ రుణాలను సమర్థవంతంగా నిర్వహించడానికి అధునాతన సాధనాలను అందిస్తుంది.