UPI : నగదుకు కాలం చెల్లింది.. యూపీఐ రాజ్యమేలుతోంది.. చరిత్ర సృష్టించిన డిజిటల్ ఇండియా.
UPI : డిజిటల్ ఇండియా ప్రస్థానంలో భారత్ మరో అద్భుత మైలురాయిని అధిగమించింది. ఒకప్పుడు నగదు లావాదేవీలకే మొగ్గు చూపిన భారతీయులు, ఇప్పుడు యూపీఐ మాయలో పడిపోయారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. దేశంలో నగదు చలామణిని యూపీఐ వెనక్కి నెట్టేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం లావాదేవీల్లో యూపీఐ వాటా 57 శాతానికి చేరుకోగా, నగదు వాటా 38 శాతానికి పడిపోయింది. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు, చిల్లర కష్టాలు లేకుండా తక్షణమే డబ్బులు పంపే సౌలభ్యం ఉండటమే దీనికి ప్రధాన కారణమని నివేదిక స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 13-14 తేదీల్లో జరిగిన చింతన్ శిబిర్ వేదికగా ఆర్థిక సేవల విభాగం ఈ సమగ్ర నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని సుమారు 10,378 మంది వినియోగదారులు, వ్యాపారులు, సేవా ప్రతినిధుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విశ్లేషణ చేశారు. ఇందులో తేలిందేమిటంటే.. దాదాపు 65 శాతం మంది యూపీఐ యూజర్లు ప్రతిరోజూ కనీసం ఒకటి కంటే ఎక్కువ డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ వైపు అడుగులు వేస్తుండటం విశేషం.
యూపీఐ దూసుకుపోతున్నా, గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో రూపే డెబిట్ కార్డుల వినియోగం ఇంకా ఆశించిన స్థాయిలో లేదని ప్రభుత్వం గుర్తించింది. అందుకే పల్లెటూళ్లలో రూపే కార్డుల విప్లవాన్ని తీసుకురావడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అవసరమని నివేదిక సిఫార్సు చేసింది. చిన్న వ్యాపారులను డిజిటల్ బాట పట్టించడం, యూపీఐ లైట్ వంటి తక్కువ విలువ కలిగిన లావాదేవీల సౌకర్యాలను విస్తరించడం ద్వారా పల్లెల్లో కూడా నగదు రహిత లావాదేవీలను పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం డిజిటల్ అక్షరాస్యతను పెంచడం, నెట్‌వర్క్ కనెక్టివిటీని మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకోనున్నారు.
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఏమాత్రం వెనకాడటం లేదు. 2022 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం వరకు రూపే డెబిట్ కార్డులు, తక్కువ విలువ గల యూపీఐ లావాదేవీల విస్తరణ కోసం ప్రభుత్వం ఏకంగా రూ.8,276 కోట్లను ప్రోత్సాహకాల రూపంలో ఖర్చు చేసింది. ఇందులో 2024 ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా రూ.3,631 కోట్లు కేటాయించడం విశేషం. డిజిటల్ మోసాల బారి నుంచి ప్రజలను రక్షించడానికి, భద్రతను పటిష్టం చేయడానికి కూడా నిరంతరం నిధులు వెచ్చిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
భవిష్యత్తులో నగదు వాటాను మరింత తగ్గించి, రూపే కార్డులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేవలం నగరాలకే పరిమితం కాకుండా, మారుమూల గ్రామాలలోని సామాన్యుడు కూడా రూపే కార్డును స్వేచ్ఛగా వాడేలా వ్యాపారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు పట్టనున్నారు. సైబర్ సెక్యూరిటీపై అవగాహన పెంచుతూ, ప్రతి భారతీయుడినీ డిజిటల్ యోధుడిగా మార్చడమే డిజిటల్ ఇండియా తదుపరి లక్ష్యమని ఆర్థిక శాఖ పేర్కొంది.