FALCON: భారత్‌లోనే 'ఫాల్కన్ 2000' జెట్ తయారీ
జెట్ తయారీ రంగంలో భారత్ మరో కీలక అడుగు;
భారత్.. బిజినెస్ జెట్ తయారీ రంగంలో మరో కీలక అడుగు వేసింది. ప్రముఖ ఫ్రెంచ్ విమాన తయారీ సంస్థ దసో ఏవియేషన్‌తో కలిసి రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, భారత్‌లో 'ఫాల్కన్ 2000' ఎగ్జిక్యూటివ్ జెట్ విమానాల తయారీకి రంగం సిద్ధం చేసింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని పారిస్‌లో జరిగిన ఎయిర్ షో సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. ఈ భాగస్వామ్యంలో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ భాగస్వామిగా ఉంటుంది. తొలి విడతగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఫాల్కన్ 2000 అసెంబ్లింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ ప్రారంభం కాగానే, భారత్ — అమెరికా, ఫ్రాన్స్, కెనడా, బ్రెజిల్ వంటి దేశాలతో పాటు బిజినెస్ జెట్ తయారీదారుల జాబితాలో చోటు సంపాదించనుంది. ఇది ఫాల్కన్ 2000 జెట్‌లను ఫ్రాన్స్ వెలుపల తయారు చేయబోతున్న తొలి ప్రయత్నం కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతికి ఉద్దేశించి ఈ విమానాలను భారత్‌లో తయారు చేయనున్నారు.
ఫాల్కన్ 2000 అనేది రెండు ఇంజిన్లతో కూడిన అధునాతన బిజినెస్ జెట్. ఇందులో 8-10 మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. వేగవంతమైన, మోడరన్ ఫ్లైట్ డిజైన్‌తో ఈ జెట్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఈ ఒప్పందం గురించి మాట్లాడిన రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మాట్లాడారు.. "దసోతో భాగస్వామ్యం, రిలయన్స్ గ్రూప్ చరిత్రలోనే ఒక మైలురాయి. విమాన తయారీ రంగంలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా నిలబెట్టేందుకు ఇది కీలకం. ఫాల్కన్ 2000 జెట్‌లను భారతదేశంలో తయారు చేయడం, మన దేశం యొక్క సాంకేతిక నైపుణ్యానికి, తయారీ సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తుంది." అని అన్నారు.