Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ప్రపోజల్ ఫామ్‌లో ఈ తప్పులు చేస్తే పైసా రాదు.

Update: 2026-02-27 07:15 GMT

Health Insurance : ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కానీ, నేటి కాలంలో అనారోగ్యం వస్తే ఆస్తి కరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక ప్రాథమిక అవసరంగా మారింది. అయితే, పాలసీ తీసుకునేటప్పుడు మనం కేవలం ప్రీమియం ఎంత? ఏ ఏ ఆస్పత్రులు నెట్‌వర్క్‌లో ఉన్నాయి? వంటి విషయాలనే చూస్తాం. కానీ, అసలు సిసలైన ప్రపోజల్ ఫామ్ నింపేటప్పుడు మాత్రం చాలామంది నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఈ చిన్న పొరపాటే రేపు పొద్దున్న మీ క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి ప్రధాన కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రపోజల్ ఫామ్ అనేది కేవలం ఒక కాగితం ముక్క కాదు.. అది మీకు, బీమా కంపెనీకి మధ్య జరిగే ఒక చట్టపరమైన ఒప్పందం. మీరు ఇచ్చే వ్యక్తిగత, ఆరోగ్య సమాచారం ఆధారంగానే కంపెనీ మీకు ఎంత రిస్క్ ఉందో అంచనా వేస్తుంది. ఫామ్ నింపేటప్పుడు ఏదైనా విషయాన్ని దాచినా లేదా తప్పుగా చెప్పినా, అత్యవసర సమయంలో ఆస్పత్రి బిల్లులు చెల్లించాల్సి వచ్చినప్పుడు బీమా కంపెనీ చేతులెత్తేసే అవకాశం ఉంది. అందుకే ఫైనాన్షియల్ అడ్వైజర్లు ఎప్పుడూ ఒకటే చెబుతుంటారు.. "ప్రపోజల్ ఫామ్ నింపడానికి కాస్త సమయం కేటాయించండి, ప్రతి విషయాన్ని నిజాయితీగా రాయండి" అని.

చాలామంది చేసే అతిపెద్ద తప్పు పాత రోగాలను దాచడం. మీకు బీపీ, షుగర్, థైరాయిడ్ లేదా ఆస్తమా వంటి సమస్యలు ఉంటే వాటిని స్పష్టంగా పేర్కొనాలి. "నేను మందులు వాడుతున్నాను కదా, ఇప్పుడు అంతా కంట్రోల్‌లోనే ఉంది కదా" అని అనుకుని ఆ వివరాలు చెప్పకపోతే భవిష్యత్తులో చిక్కులు తప్పవు. అలాగే గతంలో ఎప్పుడైనా ఆస్పత్రిలో చేరినా లేదా ఏదైనా ఆపరేషన్ జరిగినా ఆ వివరాలన్నీ కంపెనీకి తెలపాలి. బీమా కంపెనీలు క్లెయిమ్ ఇచ్చే ముందు లోతుగా దర్యాప్తు చేస్తాయి. అప్పుడు మీరు దాచిన చిన్న విషయం బయటపడినా మీ క్లెయిమ్ ఫైల్ పక్కన పడేస్తారు.

ఆరోగ్యంతో పాటు మీ జీవనశైలి వివరాలు కూడా చాలా ముఖ్యం. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉంటే నిజాయితీగా చెప్పాలి. బరువు ఎంత ఉన్నారు? గతంలో ఏదైనా ఇన్సూరెన్స్ రిజెక్ట్ అయ్యిందా? వంటి వివరాలను కూడా దాచకూడదు. స్టార్ హెల్త్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమితాబ్ జైన్ ప్రకారం.. డాక్యుమెంట్లు పారదర్శకంగా ఉన్నప్పుడు క్లెయిమ్ సెటిల్మెంట్ చాలా సులభంగా జరుగుతుంది. వివాదాలన్నీ సమాచారం దాచడం వల్లే మొదలవుతాయి. కాబట్టి, పాలసీ తీసుకునేటప్పుడే అన్ని నిజాలు చెప్పి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు భరోసా కల్పించుకోండి.

Tags:    

Similar News