Mahindra Thar vs Force Gurkha : మహీంద్రా థార్ vs ఫోర్స్ గూర్ఖా.. లోగోల వెనుక ఉన్న టెక్నాలజీ మర్మం ఇదే.

Update: 2026-03-06 10:00 GMT

Mahindra Thar vs Force Gurkha : భారతదేశంలో ఆఫ్ రోడింగ్ పిచ్చి ఉన్నవారికి మహీంద్రా థార్, ఫోర్స్ గూర్ఖా అంటే ప్రాణం. కొండలు, కోనలు, బురద దారులు.. ఇలాంటి కఠినమైన దారుల్లో ఈ రెండు కార్లు ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి. అయితే, మీరు గమనించే ఉంటారు.. థార్ కారుపై 4X4 లేదా 4WD అని రాసి ఉంటుంది. కానీ, ఫోర్స్ గూర్ఖాపై మాత్రం వింతగా 4X4X4 అనే బ్యాడ్జ్ కనిపిస్తుంది. చాలామంది ఈ కారును వాడుతున్నా, ఆ మూడో 4 వెనుకున్న అసలు మర్మం ఏంటో తెలియక బుర్ర గీక్కుంటారు. అసలు గూర్ఖా కంపెనీ ఆ పేరు వెనుక దాచిన అసలు రహస్యం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఆ మూడు నాలుగుల వెనుక ఉన్న పవర్ ఏంటి?

ఫోర్స్ గూర్ఖాపై ఉన్న 4X4X4 అనేది కేవలం స్టైల్ కోసం పెట్టిన పేరు కాదు. ఇది ఆ కారుకు ఉన్న మూడు ప్రధాన సామర్థ్యాలను సూచిస్తుంది. ఇందులో మొదటి 4 దేన్ని సూచిస్తుందంటే.. ఈ ఎస్‌యూవీ ఫోర్ వీల్ డ్రైవ్ టెక్నాలజీతో పనిచేస్తుందని అర్థం. అంటే ఇంజిన్ ఇచ్చే పవర్ కేవలం రెండు చక్రాలకే కాకుండా నాలుగు చక్రాలకు సమానంగా అందుతుంది. దీనివల్ల బురదలో లేదా ఇసుకలో కారు ఇరుక్కుపోయినా, మిగిలిన చక్రాల సాయంతో ఈజీగా బయటపడవచ్చు. ఆఫ్-రోడింగ్‌లో ఇది చాలా కీలకం.

రెండో 4.. సీజన్ ఏదైనా తగ్గేదే లే

గూర్ఖా బ్యాడ్జ్‌లోని రెండో 4 సంవత్సరం పొడవునా ఉండే నాలుగు కాలాలను సూచిస్తుంది. అంటే వేసవి ఎండలు, వానాకాలం బురద, చలికాలం మంచు లేదా ఆకురాలే కాలం.. ఇలా వాతావరణం ఏదైనా, పరిస్థితి ఎలా ఉన్నా ఈ కారు మొండిగా ముందుకు సాగుతుందని కంపెనీ భరోసా ఇస్తోంది. ఎంతటి కఠినమైన వాతావరణంలోనైనా నమ్మకమైన ప్రయాణాన్ని అందించడమే ఈ రెండో నంబర్ ఉద్దేశం. అందుకే అడ్వెంచర్ ఇష్టపడేవారు గూర్ఖా వైపు మొగ్గు చూపుతారు.

మూడో 4.. ఎటువంటి రోడ్డునైనా ఎదిరిస్తుంది

ఇక ఆఖరి, మూడో 4 దేని గురించి చెబుతుందంటే.. గూర్ఖా కారు నాలుగు రకాల భౌగోళిక పరిస్థితులలో అద్భుతంగా ప్రయాణించగలదు. ఇసుక తిన్నెలు, లోతైన నీళ్లు, రాతి గుట్టలు, మంచు కురిసే దారులు.. ఇలా ఎక్కడైనా సరే గూర్ఖా దూసుకుపోతుంది. ఈ మూడు ప్రత్యేకతలను కలిపి చెప్పడానికే ఫోర్స్ మోటార్స్ 4X4X4 అనే ట్యాగ్‌ను వాడుతోంది. అంటే ఇది ఆల్-టెర్రైన్, ఆల్-సీజన్ పవర్‌ఫుల్ వెహికల్ అన్నమాట.

అసలు 4×4 లేదా 4WD అంటే ఏంటి?

సాధారణ కార్లలో ఇంజిన్ పవర్ కేవలం ముందు లేదా వెనుక చక్రాలకు మాత్రమే అందుతుంది. కానీ 4X4 లేదా 4WD సిస్టమ్‌లో ఇంజిన్ శక్తి నాలుగు చక్రాలకు చేరుతుంది. దీనివల్ల కారుకు రోడ్డుపై పట్టు పెరుగుతుంది. ముఖ్యంగా రోడ్లు లేని చోట ప్రయాణించేటప్పుడు కారు అదుపు తప్పకుండా ఉండటానికి, ఎత్తుపల్లాలను సులభంగా అధిగమించడానికి ఈ టెక్నాలజీ ప్రాణం పోస్తుంది. అందుకే థార్ అయినా, గూర్ఖా అయినా ఈ టెక్నాలజీ వల్లే ఆఫ్-రోడింగ్ కింగ్స్‌గా నిలిచాయి.

Tags:    

Similar News