Nissan Tekton SUV : క్రెటా, సెల్టోస్‌లకు చుక్కలే.. నిస్సాన్ నుంచి సరికొత్త టెక్టాన్ ఎస్‌యూవీ.
Nissan Tekton SUV : భారతదేశపు మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ప్రకంపనలు సృష్టించేందుకు నిస్సాన్ సిద్ధమైంది. సరికొత్త డిజైన్, అదిరిపోయే పవర్‌తో నిస్సాన్ టెక్టాన్ పేరుతో సరికొత్త ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఇటీవల పూణే సమీపంలోని పింప్రి ప్రాంతంలో ఈ కారు టెస్టింగ్ నిర్వహిస్తుండగా కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. రెనో డస్టర్ ప్లాట్‌ఫారమ్ మీద తయారవుతున్నప్పటికీ, ఇది చూడటానికి నిస్సాన్ గ్లోబల్ మోడల్ ప్యాట్రోల్ లాంటి భారీ ఎస్‌యూవీని తలపిస్తోంది. రఫ్ అండ్ టఫ్ లుక్‌తో వస్తున్న ఈ కారు రోడ్డుపై వెళ్తుంటే ఆ రాజసమే వేరుగా ఉంటుందని లీకైన చిత్రాలు చెబుతున్నాయి.
నిస్సాన్ టెక్టాన్ డిజైన్ విషయంలో నిస్సాన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. చతురస్రాకారపు వీల్ ఆర్చెస్, సి పిల్లర్‌పై అమర్చిన వెనుక డోర్ హ్యాండిల్స్, మరియు వంపు తిరిగిన రూఫ్‌లైన్ దీనికి ఒక ప్రత్యేక గుర్తింపును ఇస్తున్నాయి. వెనుక భాగంలో రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, వాలుగా ఉండే విండ్‌షీల్డ్, ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన సి ఆకారపు ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. ముందు భాగంలో అదిరిపోయే ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్, వెడల్పాటి ఎల్‌ఈడీ బార్, క్రోమ్ ఫినిషింగ్‌తో కూడిన గ్రిల్ ఈ కారుకు భౌకాలీ లుక్‌ను ఇస్తాయి. దీని పొడవు సుమారు 4,345 మిమీ ఉండటంతో లోపల స్థలం కూడా పుష్కలంగా ఉంటుంది.
లోపల అడుగు పెడితే టెక్టాన్ ఒక లగ్జరీ ప్రపంచాన్ని తలపిస్తుంది. రెనో డస్టర్‌తో కొన్ని భాగాలు పంచుకున్నప్పటికీ, ఇంటీరియర్ థీమ్, సీట్ కవర్ల విషయంలో నిస్సాన్ తన మార్క్ చూపిస్తోంది. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కలిపి ఉండే డ్యూయల్ స్క్రీన్ సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వీటితో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్ (AQI డిస్ప్లేతో), డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇందులో అత్యాధునిక ADAS సిస్టమ్ కూడా ఉండబోతోంది.
ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, నిస్సాన్ మూడు రకాల వేరియంట్లను అందించే అవకాశం ఉంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్, మైలేజీ ప్రియుల కోసం 1.8 లీటర్ టర్బో పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్లను తీసుకురానుంది. దీనివల్ల వేగాన్ని ఇష్టపడే వారితో పాటు, పెట్రోల్ ఆదా చేయాలనుకునే వారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ కారుతో పాటు భవిష్యత్తులో మూడు వరుసల సీట్లు కలిగిన ఎస్‌యూవీని కూడా లాంచ్ చేసే ప్లాన్‌లో నిస్సాన్ ఉంది.
నిస్సాన్ టెక్టాన్ మార్కెట్లోకి వస్తే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, స్కోడా కుషాక్ వంటి దిగ్గజ కార్లకు చుక్కలు చూపించడం ఖాయం. వాస్తవానికి ఈ కారు ఫిబ్రవరిలోనే లాంచ్ కావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. త్వరలోనే నిస్సాన్ కొత్త లాంచ్ డేట్‌ను ప్రకటించనుంది. టాటా సియెర్రాకు గట్టి పోటీనిస్తూ, నిస్సాన్ నుంచి ఈ ఏడాది వస్తున్న రెండో పెద్ద లాంచ్ ఇదే కావడం విశేషం.