Inflation Update : తగ్గిన తిండి ఖర్చు.. పెరిగిన నెట్ ఖర్చు.. భారతీయుల లైఫ్ స్టైల్‌లో పెను మార్పులు.
Inflation Update : కాలం మారింది, మనుషులూ మారారు, వారితో పాటు వారి ఖర్చు చేసే అలవాట్లు కూడా మారిపోయాయి. భారతదేశంలో జీవన ప్రమాణాలు వేగంగా మారుతున్నాయని చెప్పడానికి తాజా ఆర్థిక గణాంకాలే నిదర్శనం. నిన్నటి దాకా కూడు, గూడు, గుడ్డ అనే ప్రాథమిక అవసరాల చుట్టూ తిరిగిన భారతీయుల బడ్జెట్, ఇప్పుడు వినోదం, విలాసాలు, డిజిటల్ సేవల వైపు మళ్లింది. దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వం తన వినియోగదారుల ధరల సూచిక లేదా ద్రవ్యోల్బణ బాస్కెట్‌ను సమూలంగా ప్రక్షాళన చేసింది.
ద్రవ్యోల్బణాన్ని సరిగ్గా కొలవాలంటే జనం దేనికోసం ఎంత ఖర్చు చేస్తున్నారో తెలియాలి. ఇప్పటివరకు మనం 2011-12 నాటి అలవాట్ల ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని కొలిచేవాళ్లం. కానీ ఆ దశాబ్ద కాలంలో దేశం చాలా మారిపోయింది. అప్పట్లో డిజిటల్ పేమెంట్లు లేవు, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీలు లేవు, యాప్ ఆధారిత రవాణా లేదు. అందుకే ప్రభుత్వం బేస్ ఇయర్ ను 2024కు మార్చి, బాస్కెట్ లో మార్పులు చేసింది. ఇందులో భాగంగా పనికిరాని పాత వస్తువులను (VCR, కేసెట్ ప్లేయర్ వంటివి) తీసివేసి, కొత్త తరం వస్తువులను (స్మార్ట్‌ఫోన్లు, డేటా ప్లాన్లు, ఏరోప్లేన్ టికెట్లు) చేర్చింది. ఇది గణాంకాలలో మరింత ఖచ్చితత్వాన్ని ఇస్తుంది.
తాజా సీపీఐ మార్పుల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తిండికి ఇచ్చే ప్రాధాన్యత తగ్గడమే. గతంలో ద్రవ్యోల్బణ సూచీలో ఆహార పదార్థాల వాటా 46% ఉండేది, కానీ ఇప్పుడు అది సుమారు 37% కి పడిపోయింది. అంటే భారతీయులు అన్నం తినడం తగ్గించారని కాదు, వారి ఆదాయం పెరగడంతో ఆహారం కంటే ఇతర అవసరాలకు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని అర్థం. దీనివల్ల ఆహార ధరల్లో వచ్చే అస్థిరత ఇకపై మొత్తం ద్రవ్యోల్బణంపై గతంలో ఉన్నంత ప్రభావం చూపకపోవచ్చు. ఇది ఆర్థికంగా ఒక గొప్ప పరిణామం.
ప్రస్తుతం భారతీయులు కేవలం బుక్కెడు బువ్వ కోసం మాత్రమే కాకుండా.. గృహ వసతి, విద్య, ఆరోగ్యం, వినోదం కోసం భారీగా వెచ్చిస్తున్నారు. ఒకప్పుడు గ్రామాల్లో ఇల్లు అద్దెకు ఇవ్వడం అనేది అరుదుగా ఉండేది, కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా హౌసింగ్ రెంట్ అనేది సాధారణమైపోయింది. అందుకే కొత్త సీపీఐ లో గ్రామీణ అద్దెలను కూడా చేర్చారు. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, విమాన ప్రయాణాలు, టెలికాం ప్లాన్లు ఇప్పుడు కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితం కాలేదు, సగటు భారతీయ కుటుంబ బడ్జెట్‌లో ఇవి అంతర్భాగమయ్యాయి.
గృహ వినియోగ వ్యయ సర్వే ప్రకారం.. 2011-12 లో గ్రామీణ భారతీయుడు నెలకు సగటున రూ.1,430 ఖర్చు చేస్తే, అది 2022-23 నాటికి రూ.3,773 కు చేరింది. పట్టణాల్లో ఇది రూ.2,630 నుంచి రూ.6,459కు పెరిగింది. అంటే పదేళ్లలో ఖర్చులు రెట్టింపు కంటే ఎక్కువే అయ్యాయి. ప్రజల ఆదాయం పెరగడంతో వారు మెరుగైన జీవనం, సౌకర్యాల కోసం వెతుకుతున్నారు. ఇది మన ఆర్థిక వ్యవస్థ లోయర్-మిడిల్ నుంచి మిడిల్-ఇన్కమ్ వైపు వేగంగా దూసుకెళ్తోందని సూచిస్తోంది.
జనవరి 2026 నాటి ఈ సీపీఐ మార్పులు కేవలం సాంకేతిక గణాంకాలు మాత్రమే కాదు. ఇవి సగటు భారతీయుడి ఆశలను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయి. మనం కేవలం కడుపు నింపుకోవడం నుంచి.. సౌకర్యవంతమైన, డిజిటల్ జీవనాన్ని గడపడం వైపు మళ్ళాం. ఆహారం ఇంకా కీలకమే అయినప్పటికీ, సేవా రంగం పెత్తనం పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ పరిపక్వతకు నిదర్శనం.