Pension Scheme : పెన్షన్ స్కీమ్‌కు ఫుల్‌స్టాప్? కొత్త పెన్షన్ విధానంపై ప్రభుత్వం క్లారిటీ.
Pension Scheme : దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పాత పింఛను పథకం పునరుద్ధరణ డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. ఓపీఎస్‌ను తిరిగి తీసుకురావడం ఇక అసాధ్యమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. పాత పింఛను పథకానికి బదులుగా, జాతీయ పింఛను పథకం, ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన ఏకీకృత పింఛను పథకం వంటి కొత్త వ్యవస్థలే భవిష్యత్తు మార్గమని కేంద్రం స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం జనవరి 2004లో పాత పింఛను పథకం స్థానంలో జాతీయ పింఛను పథకం (NPS)ను ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఈ రెండు పథకాలపై చర్చ జరుగుతూనే ఉంది. ఇందులో పింఛను మొత్తాన్ని ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది. ఇది ఉద్యోగుల నుంచి ఎలాంటి వాటా లేకుండా, పింఛనుకు గ్యారెంటీ ఉండేది. ఇది ఉద్యోగులు, ప్రభుత్వం ఇద్దరూ తమ జీతం నుంచి కొంత వాటాను జమ చేయాల్సి ఉంటుంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సంఖ్య పెరగడంతో ఓపీఎస్ భారం ప్రభుత్వ ఖజానాపై విపరీతంగా పెరిగింది.
ఉద్యోగుల నుంచి ఓపీఎస్ పునరుద్ధరణ డిమాండ్లు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త ఏకీకృత పింఛను పథకం (UPS)ను అమలు చేసింది. యూపీఎస్ అనేది ఎన్‌పీఎస్, ఓపీఎస్ లను మిళితం చేసిన ఒక హైబ్రిడ్ పథకం. ఇందులో వాటా చెల్లించడం తప్పనిసరి. అయితే, ఇందులో ఉద్యోగులకు కనీస పింఛనుకు గ్యారెంటీ ఇస్తారు. పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం ఉండేలా చూడటం ఈ పథకం లక్ష్యం.
ఉద్యోగుల సంఘాలు 8వ వేతన సంఘం ముందు ఓపీఎస్ పునరుద్ధరణను ప్రధాన అంశంగా లేవనెత్తాయి. కానీ, దీనిపై కేంద్రం తన వైఖరిని గట్టిగా స్పష్టం చేసింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో 8వ వేతన సంఘం నియమ నిబంధనలకు ఆమోదం లభించింది. ఉద్యోగుల వాటా లేకుండా ప్రభుత్వం పూర్తిగా భరించే (ఓపీఎస్ మాదిరి) పథకాలు ఆర్థికంగా స్థిరమైనవి కావు అని ప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చింది.
ఆర్థిక నిపుణుల ప్రకారం ఓపీఎస్ తిరిగి అమలు చేయడం అనేది దేశ ఆర్థిక వ్యవస్థపై పెను భారాన్ని మోపుతుంది. ఓపీఎస్ తిరిగి వస్తే ప్రభుత్వ బడ్జెట్‌పై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పింఛను వ్యయం మొత్తం బడ్జెట్‌లో 20% నుంచి 25% వరకు ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఓపీఎస్‌ను తిరిగి అమలు చేస్తే, అభివృద్ధి పథకాలకు, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు తగ్గించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఎన్‌పీఎస్, యూపీఎస్ వంటి పారదర్శకమైన వ్యవస్థలే భవిష్యత్తుకు సరియైనవని ప్రభుత్వం భావిస్తోంది.