Financial Tips : ఇన్వెస్ట్‌మెంట్ లో కొత్త ట్రెండ్..బంగారం, వెండి వదిలి జెన్ జీ చూపు మ్యూచువల్ ఫండ్స్ వైపు.
Financial Tips : భారతదేశంలో పెట్టుబడి పెట్టే పద్ధతులు శరవేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు ఆస్తి అంటే బంగారం లేదా భూమి మాత్రమే అని భావించేవారు. కానీ నేటి జెన్ జీ తరం రూటు మార్చింది. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన ఈ యువత ఇప్పుడు బంగారం కంటే మ్యూచువల్ ఫండ్స్‌పైనే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కాలేజీ స్టూడెంట్స్ నుంచి కొత్తగా ఉద్యోగంలో చేరిన వారి వరకు అందరూ ఇప్పుడు సిప్ మంత్రం జపిస్తున్నారు.
పెట్టుబడి పెట్టాలంటే బ్యాంకులకు వెళ్లాలి లేదా ఏజెంట్ల చుట్టూ తిరగాలి అనే రోజులు పోయాయి. ఇప్పుడు చేతిలో మొబైల్ ఉంటే చాలు.. నిమిషాల్లో ఇన్వెస్ట్‌మెంట్ మొదలుపెట్టవచ్చు. గ్రో, ఫోన్‌పే వెల్త్, జెరోధా, పేటీఎం మనీ వంటి ఫిన్‌టెక్ యాప్స్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను చాలా సులభతరం చేశాయి. అక్టోబర్ 2025 డేటా ప్రకారం.. కొత్తగా మొదలవుతున్న సిప్ రిజిస్ట్రేషన్లలో ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్లే సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. యువతకు అర్థమయ్యే సులభమైన భాష, తక్కువ పెట్టుబడి (రూ.500 నుండే), సులభంగా ట్రాక్ చేసే సౌకర్యం ఉండటంతో జెన్ జీ వీటికి ఫిదా అవుతోంది.
దేశంలోని అతిపెద్ద రిజిస్ట్రార్ కంపెనీ CAMS గణాంకాల ప్రకారం.. ప్రతి ఐదుగురు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లలో ఒకరు జెన్ జీ తరానికి చెందినవారే. 2025లో కొత్తగా చేరిన పెట్టుబడిదారులలో మూడో వంతు మంది యువత ఉండటం విశేషం. కోవిడ్ తర్వాత స్టాక్ మార్కెట్ పెరిగిన తీరును చూసిన ఈ యువత.. రిస్క్ తీసుకోవడానికి భయపడటం లేదు. దాదాపు 90 శాతం కంటే ఎక్కువ మంది యువ ఇన్వెస్టర్లు సిప్ ద్వారానే పెట్టుబడులు పెడుతున్నారు. ఇది వారికి క్రమశిక్షణతో కూడిన పొదుపును అలవాటు చేస్తోంది.
నేటి యువత ఎవరి సలహాల కోసమో వేచి చూడకుండా, స్వయంగా రీసెర్చ్ చేసి పెట్టుబడి పెట్టే DIY పద్ధతిని ఇష్టపడుతున్నారు. డైరెక్ట్ ప్లాన్స్ ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల కమీషన్లు తగ్గి లాభాలు ఎక్కువగా వస్తాయని వారు గుర్తిస్తున్నారు. ఫోన్‌పే వెల్త్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో 90 శాతం జెన్ జీ పెట్టుబడులు సిప్ రూపంలోనే రావడం గమనార్హం. చిన్న చిన్న మొత్తాలను ప్రతి నెలా ఆటోమేటిక్‌గా ఇన్వెస్ట్ చేసే సౌలభ్యం వారి జీవనశైలికి సరిగ్గా సరిపోతోంది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ భవిష్యత్తు ఇప్పుడు ఈ యువత వేళ్లపైనే ఆధారపడి ఉంది.