Gold Price : షాక్ ఇచ్చిన గోల్డ్ రేట్లు..ఒక్కసారిగా లక్షన్నర దాటిన ధర..ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారా?
Gold Price : గత రెండు రోజులుగా ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. సోమవారం నాడు 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,47,878 వద్ద ఉండగా, బుధవారం (ఫిబ్రవరి 4, 2026) నాటికి అది రూ.1,57,620 కు చేరుకుంది. అంటే కేవలం రెండు రోజుల్లోనే సుమారు 6.59% మేర ధర పెరిగింది. నిజానికి జనవరి 29న బంగారం ధర రూ.1,75,231 వద్ద ఆల్-టైమ్ రికార్డు సృష్టించింది. అక్కడి నుంచి 15 శాతానికి పైగా పతనం అయిన పసిడి.. ఇప్పుడు మళ్లీ కోలుకుంటుండటం ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తిస్తోంది. నేడు 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,440 వద్ద ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు ధరలో దాదాపు రూ.1,820 మేర పెరుగుదల నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,150వద్ద ఉంది. బడ్జెట్ అనంతర పతనం నుంచి కోలుకుంటూ, గత రెండు రోజుల్లోనే ధరలు సుమారు రూ.11,500 కు పైగా పెరగడం విశేషం.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకుడు మానవ్ మోదీ అభిప్రాయం ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలహీనపడటమే బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో ధరలు భారీగా పడిపోవడంతో, తక్కువ ధరకు బంగారం దొరుకుతుందని ఇన్వెస్టర్లు వాల్యూ బయింగ్ మొదలుపెట్టారు. అలాగే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఉన్న ఆశలు పసిడికి మద్దతుగా నిలుస్తున్నాయి. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు జనం మళ్లీ మొగ్గు చూపుతున్నారు.
బంగారం ధరలను ప్రభావితం చేయడంలో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. చైనీస్ లూనార్ న్యూ ఇయర్ సందర్భంగా అక్కడ ఫిజికల్ గోల్డ్ కొనుగోళ్లు భారీగా జరుగుతున్నాయి. అయితే అక్కడి ప్రభుత్వ బ్యాంకులు ధరల హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవడం గమనార్హం. మరోవైపు, భారత్-అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ వల్ల మార్కెట్‌లో అనిశ్చితి తగ్గుతుందని, దీనివల్ల బంగారం ధరలు కొంతకాలం పాటు ఒకే పరిధిలో ఉండే అవకాశం ఉందని ఐబీజేఏ అధ్యక్షుడు పృథ్వీరాజ్ కొఠారి అభిప్రాయపడ్డారు. రూపాయి విలువ బలోపేతం కావడం వల్ల దేశీయంగా దిగుమతి ఖర్చులు తగ్గి ధరలు కాస్త స్థిరంగా ఉండవచ్చు.
ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?
మీరు దీర్ఘకాలిక ఇన్వెస్టర్ అయితే బంగారాన్ని నమ్ముకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. షార్ట్ టర్మ్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, మధ్య కాలం నుంచి దీర్ఘకాలం వరకు బంగారం ధరలు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గ్లోబల్ టెన్షన్లు, సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకోవడం వంటి అంశాలు పసిడికి సానుకూలంగా ఉన్నాయి. ప్రతి పతనాన్ని ఒక కొనుగోలు అవకాశంగా భావించి, సెలెక్టివ్ గా పెట్టుబడి పెట్టడం మంచిదని మార్కెట్ పండితులు సలహా ఇస్తున్నారు.