Jewellery Sales : దీపావళి సీజన్లో తగ్గిన బంగారం కొనుగోళ్లు..వెలవెలబోతున్న దుకాణాలు.
Jewellery Sales : భారతదేశంలో దీపావళి పండుగ వచ్చిందంటే బంగారం కొనుగోలు తప్పనిసరి. కానీ, ఈసారి మార్కెట్‌లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యులకు నగలు కొనడం కష్టమైంది. సాధారణంగా నవరాత్రుల నుంచి దీపావళి వరకు జ్యువెలరీ దుకాణాలు కిటకిటలాడేవి. కానీ, ఈసారి కొనుగోలుదారుల రద్దీ తగ్గింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అంచనా ప్రకారం.. ఈ దీపావళికి ముందు మూడు వారాల్లో నగల కొనుగోళ్లు దాదాపు 27% వరకు తగ్గే అవకాశం ఉంది.
ఈ సంవత్సరం బంగారం ధరలు దాదాపు రూ.1,25,000 (10 గ్రాములు) వరకు చేరుకున్నాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే సుమారు 50% ఎక్కువ. దీని ప్రభావం అమ్మకాలపై స్పష్టంగా కనిపిస్తోంది. రక్షాబంధన్ నుంచి ఓనం వరకు జరిగిన తొలి విడత కొనుగోళ్లలో బంగారం డిమాండ్ 28% పడిపోయింది. దీంతో వినియోగదారులు 22 క్యారెట్ల బంగారానికి బదులుగా, కొంచెం చవకైన 18 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
ధరలు పెరగడంతో కొనుగోలుదారులు తమ ఆలోచనలను మార్చుకున్నారు. ఇప్పుడు బంగారం కొంటున్నవారు కూడా భారీ నగలకు బదులుగా చిన్న కాయిన్స్ లేదా తేలికపాటి ఆభరణాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా 2 నుంచి 5 గ్రాముల బంగారు నాణేలకు డిమాండ్ బాగా పెరిగింది. నగలపై చెల్లించాల్సిన మేకింగ్ ఛార్జీలు నాణేలపై ఉండవు కాబట్టి, ప్రజలు నగలపై ఖర్చు పెట్టడానికి బదులు స్వచ్ఛమైన బంగారు నాణేలు లేదా బిస్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. ఇది తెలివైన పెట్టుబడి మార్గంగా నిపుణులు చెబుతున్నారు.
మార్కెట్లో డిమాండ్ తగ్గినప్పటికీ, పెద్ద జ్యువెలరీ బ్రాండ్‌లు మాత్రం ఈ పండుగ సీజన్‌పై నిరాశ చెందడం లేదు. దీనికి ప్రధాన కారణం పెద్ద రిటైలర్ల వద్ద తక్కువ ధరలకు కొనుగోలు చేసిన పాత స్టాక్ ఉండటమే. ధరలు భారీగా పెరగడం వల్ల వారికి ఇన్వెంటరీ లాభం వస్తుందని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి తెలిపారు.
కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ ఈ సీజన్‌పై చాలా ఉత్సాహంగా ఉన్నారు. దీపావళికి ముందే తమ కంపెనీ 15 కొత్త షోరూమ్‌లు తెరవనున్నట్లు తెలిపారు. బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్నందున, ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావించి, ఇప్పుడే కొనుగోలు చేయడమే మంచిదని వినియోగదారులు అనుకుంటున్నారని ఆయన వివరించారు.
కళ్యాణరామన్ ప్రకారం, ఉత్తర భారతదేశంలోని పట్టణ మార్కెట్‌లలో 18 క్యారెట్ల బంగారానికి డిమాండ్ పెరిగింది. దీనిని సాంప్రదాయ డిజైన్లలో కూడా ఉపయోగిస్తున్నారు. అయితే, దక్షిణ భారతదేశంలో ఇప్పటికీ 22 క్యారెట్ల బంగారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని సెన్కో గోల్డ్ ఎండీ, సీఈఓ సువంకర్ సేన్ కూడా వ్యక్తం చేశారు. ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, తమ కంపెనీకి ఈ పండుగ, పెళ్లిళ్ల సీజన్‌లో 18-20% అమ్మకాల వృద్ధి ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.