GOLD: జెన్ జడ్ యువతకు బంగారం అంటే పెట్టుబడే!
బంగారం పెట్టుబడికి ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి... జెన్ జడ్ యువత: ఆభరణం కాదు, ఇన్వెస్ట్మెంట్
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం కాదు, ఆర్థిక భద్రత, పెట్టుబడి. వివాహాది శుభకార్యాల నుంచి పండుగల వరకు మహిళలు కొత్త ఆభరణాలను కోరుకోవడం సంప్రదాయం. బంగారం ధర పెరుగుతున్నందున, పెట్టుబడి కోణం నుంచీ దీన్ని సమకూర్చుకోవడం పెద్దల మాట. అయితే, నేటి 'జెన్-జడ్' యువత మాత్రం ఆభరణాల కంటే పెట్టుబడి - ప్రతిఫలం కోణంలోనే బంగారాన్ని చూస్తున్నారు. 'ఎంత కాలానికి గిట్టుబాటు అవుతుంది?', '24 క్యారెట్ల బిస్కెట్లు/నాణేలు కొందామా, లేక కమొడిటీ మార్కెట్లో ట్రేడింగ్ చేద్దామా?' అని ఆలోచిస్తున్నారు.
పెట్టుబడిలో బంగారం ప్రాధాన్యత
ఆర్థిక నిపుణుల ప్రకారం, షేర్లు, బ్యాంకు డిపాజిట్లతో పాటు పోర్ట్‌ఫోలియోలో కొంత భాగం తప్పనిసరిగా బంగారంపై పెట్టుబడి ఉండాలి. సంక్షోభ సమయాల్లో షేర్ల విలువ పడిపోయినా, బంగారం ధర మాత్రం పెరుగుతుంది. ఇది అత్యవసరానికి ఆసరాగా నిలుస్తుంది, తద్వారా నగదు అవసరాలను తీరుస్తుంది. నిపుణుల సూచన ప్రకారం, అవసరాల మేరకు ఆభరణాల రూపంలో కొనుగోలు చేసుకుని, మిగులు డబ్బును మేలిమి (24 క్యారెట్ల) బంగారం రూపంలో పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం.
దేశీయ ధరలపై డాలర్ ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర డాలర్ రూపేణ తగ్గినా, దేశీయంగా మాత్రం ధర అధికంగా ఉంటోంది. దీనికి ప్రధాన కారణం రూపాయి మారకపు విలువతో పోలిస్తే డాలర్ విలువ పెరగడమే. డాలర్ మారకపు విలువ రూ.88 దాటడం వంటి పరిణామాలు పసిడి, వెండి ధరలు పెరగడానికి దారితీస్తున్నాయి.
పెట్టుబడికి భద్రత, స్వచ్ఛత కీలకం
బంగారం కొనుగోలుకు ప్రధాన కారణాలలో ఒకటి, దీన్ని ప్రపంచంలో ఎక్కడైనా, ఎప్పుడైనా విక్రయించుకునే ధీమా. చిన్నపాటి స్థలంలో దాచుకునే వీలు. అయితే, కొనుగోలులో స్వచ్ఛత, బిల్లు తప్పనిసరి. పెద్ద విక్రయశాలల్లో బిల్లుతోనే అమ్మకాలు జరుగుతాయి, రూ.2 లక్షలకు మించి నగదు తీసుకోరు, పైగా 3% జీఎస్టీ చెల్లించాలి. బిల్లు లేకపోతే నాణ్యత తక్కువ ఉన్నా ప్రశ్నించే హక్కు ఉండదు. బంగారు ఆభరణాల స్వచ్ఛతకు హామీగా ప్రభుత్వం HUID ను తప్పనిసరి చేసింది. ఆభరణాలపై ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ముద్రిస్తారు. దీనిని 'BIS కేర్' యాప్‌లో పరిశీలించి, ఆభరణం వివరాలు, స్వచ్ఛతను ధ్రువీకరించుకోవచ్చు. జింక్, రాగి, వెండి మినహా ఇతర హానికర పదార్థాలు కలిపితే HUID వేయరు. ఇది ఆభరణాలలో కల్తీని నిరోధించే ముఖ్యమైన చర్య. పాత బంగారాన్ని అంతే బరువున్న కొత్త ఆభరణంతో మార్చుకుంటే జీఎస్టీ చెల్లించాల్సిన పనిలేదు. కానీ, కొత్త ఆభరణానికి తరుగు, మజూరి ఛార్జీలు ఉంటాయి. నాణేలకు కూడా ఇవి వర్తిస్తాయి. బిస్కెట్ రూపంలో కొనే మేలిమి బంగారానికి మాత్రమే ఈ ఛార్జీలు ఉండవు. పెట్టుబడికి భౌతిక బంగారం కంటే డిజిటల్ మార్గాలు మరింత శ్రేయస్కరం. యూపీఐ యాప్‌లు, ఎంఎంటీసీ-పాంప్ వంటి మార్గాల ద్వారా బంగారం ధరను అనుసరించి ఎప్పుడైనా కొనుగోలు చేయొచ్చు. భౌతిక బంగారం డెలివరీ తీసుకోవచ్చు లేదా ఆన్లైన్లోనే విక్రయించవచ్చు. కొనుగోలు సమయంలో 3% జీఎస్టీ ఉన్నా, విక్రయ సమయంలో పన్ను ఉండదు. గోల్డ్ ఫండ్లు, కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో ట్రేడింగ్ ద్వారా కూడా పెట్టుబడులు పెట్టవచ్చు.