gold: భారీగా దిగొస్తున్న బంగారం ధర

ఒకేరోజు రూ.2వేలకు పైగా పతనం... వారం రోజుల్లో రూ.5 వేలు తగ్గిన బంగారం;

Update: 2025-05-02 05:00 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయంతో బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. ఈ ఏడాది అక్షరాల లక్ష రూపాయలు దాటిన పసిడి ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశలు, డాలర్ బలపడటంతో అంతర్జాతీయంగా బంగారం ధర భారీగా తగ్గింది. దేశీయంగానూ ఇదే ట్రెండ్ కొనసాగింది. 10 గ్రాముల ధర 24 క్యారెట్లు ఒక్కరోజులోనే రూ. 2 వేలకుపైగా పతనమైంది. గురువారం ఆసియా మార్కెట్‌లో బంగారం ధర 1.30 శాతానికిపైగా క్షీణించి ఔన్సుకు 3230 డాలర్ల స్థాయి వద్ద ట్రేడయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిణామాల ప్రభావంతో దేశీయ మార్కెట్‌లోనూ బంగారం ధర భారీగా దిగొచ్చింది. గురువారం ఒక్కరోజే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 2,180 తగ్గి రూ. 95,730కి చేరుకుంది. గత పది రోజుల్లోనే పసిడి ధర దాదాపు రూ. 5 వేల మేర తగ్గడం గమనార్హం.

చైనాతో వాణిజ్య చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవల డోనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. ఇతర దేశాలతో కూడా సంప్రదింపులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. . అమెరికా తన షరతులకు అనుగుణంగా చైనాతో ఒక మంచి ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దిగుమతి చేసుకునే 'ఆటో' విడిభాగాలపై ఉన్న సుంకాలను తగ్గించడానికి ట్రంప్ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ కూడా వాణిజ్య భాగస్వాముల నుంచి 'చాలా మంచి' ఆఫర్‌లు వచ్చాయని తెలిపారు. దీంతో వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలు బలాన్నిచ్చాయి. ఇతర కరెన్సీలు కలిగి ఉన్నవారికి బంగారం మరింత ఖరీదైనదిగా మారడంతో డిమాండ్ తగ్గింది. ఈ కారణంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఇలాగే కొనసాగినట్లయితే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

అక్షయతృతియ రోజు భారీగా...

అక్షయ తృతీయ రోజున పసిడికి డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ఏప్రిల్ 30న బంగారం కొనుగోళ్లు భారీగానే జరిగాయి. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. అందుకే మార్కెట్లో అధిక ధరలు ఉన్నప్పటికీ కొనుగోళ్లు ఏ మాత్రం తగ్గలేదు. గత ఏడాది కాలంలో బంగారం ధరలు వేగంగా పెరుగుతూ ప్రస్తుతం తులం బంగారం రూ.లక్షకు చేరువలో ఉంది. అయినప్పటికీ, ఈ అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కొనుగోళ్లు చురుగ్గానే సాగాయని ఆభరణాల వర్తకులు చెబుతున్నారు. అక్షయ తృతీయ విక్రయాలు దాదాపు రూ. 12,000 కోట్ల విలువైన 12 టన్నుల బంగారం, రూ. 4 వేల కోట్ల విలువైన వెండితో కలిపి మొత్తం రూ. 16 వేల కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు.

Tags:    

Similar News