Gold Price Crash: అమెరికా నిర్ణయంతో అల్లాడిపోయిన మార్కెట్..వెండి, బంగారం ధరల పతనానికి అసలు కారణం ఇదే.

Update: 2026-01-31 06:30 GMT

Gold Price Crash : బంగారం, వెండి మార్కెట్‌లో ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. ఇన్నేళ్లుగా లాభాల బాటలో పయనించిన పసిడి, వెండి ధరలు శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఒక్కసారిగా కుప్పకూలాయి. వెండి ఏకంగా 15 ఏళ్ల కనిష్టానికి పడిపోగా, బంగారం ధర కూడా భారీగా క్షీణించింది. రికార్డు గరిష్టాలను తాకిన మరుసటి రోజే ఇలా ధరలు పాతాళానికి పడిపోవడంతో మదుపర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలు, డాలర్ బలోపేతం కావడం వంటి కారణాలు ఈ విధ్వంసానికి దారితీశాయి.

దేశీయ కమోడిటీ మార్కెట్‎లో వెండి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో మార్చి డెలివరీ వెండి ధర ఏకంగా 17 శాతం పతనమై రూ.3,32,002 వద్దకు చేరుకుంది. ఇది 2011 తర్వాత నమోదైన అతిపెద్ద పతనం కావడం గమనార్హం. కేవలం వెండి మాత్రమే కాకుండా, బంగారం ధర కూడా 9 శాతం వరకు క్షీణించి రూ.1,54,157 వద్ద స్థిరపడింది. ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ విషయానికి వస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎస్‌బీఐ సిల్వర్ ఈటీఎఫ్ 22.4 శాతం, ఐసీఐసీఐ సిల్వర్ ఈటీఎఫ్ 21 శాతం వరకు పడిపోయాయి. బంగారం ఈటీఎఫ్‌లు కూడా 10 శాతం మేర నష్టపోయాయి.

ఈ భారీ పతనానికి ప్రధాన కారణం అమెరికాలో చోటుచేసుకున్న రాజకీయ, ఆర్థిక పరిణామాలు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్, ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్‌గా కెవిన్ వార్ష్ పేరును ప్రతిపాదించారు. వార్ష్‌ను ద్రవ్యోల్బణం విషయంలో చాలా కఠినంగా వ్యవహరించే వ్యక్తిగా ఆర్థికవేత్తలు భావిస్తారు. ఆయన రాకతో వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాలతో డాలర్ ఒక్కసారిగా పుంజుకుంది. డాలర్ ఎప్పుడైతే బలపడుతుందో బంగారం, వెండిపై పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు వెనుకాడుతుంటారు. దీనివల్ల భారీగా అమ్మకాలు పెరిగి, ధరలు ఒక్కసారిగా కిందికి దిగివచ్చాయి.

అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర 15 శాతం మేర తగ్గి ఔన్స్‌కు 98.07 డాలర్ల వద్దకు పడిపోయింది. గత కొంతకాలంగా 100 డాలర్ల మార్కు పైన కొనసాగిన వెండి, ఇప్పుడు ఆ కీలక స్థాయిని కోల్పోయింది. బంగారం కూడా 5,000 డాలర్ల మార్కు కంటే దిగువకు జారిపోయింది. వెండి ధర ఎందుకు ఇంతలా పడిపోయిందంటే.. ఇది కేవలం నగలు తయారీకే కాకుండా పరిశ్రమలలో ఎక్కువగా వాడుతుంటారు. అందుకే దీని ధరల్లో వచ్చే మార్పులు చాలా వేగంగా, తీవ్రంగా ఉంటాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అయితే, ఈ పతనం చూసి ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. సుదీర్ఘ కాలం పాటు పెరిగిన ధరల తర్వాత ఇలాంటి కరెక్షన్ సహజమని, ఇది మార్కెట్ ఆరోగ్యానికే మంచిదని భావిస్తున్నారు. అయితే రాబోయే కొద్ది రోజులు మార్కెట్ అస్థిరంగా ఉండే అవకాశం ఉందని, కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. లాభాల్లో ఉన్నవారు తమ లాభాలను స్వీకరించడం మంచిదని, రిస్క్ మేనేజ్‌మెంట్‌ను పాటిస్తూ ముందడుగు వేయాలని సలహా ఇస్తున్నారు.

Tags:    

Similar News