Investment : షేర్లు, బంగారం, ఎఫ్‌డీ.. 40 ఏళ్లలో ఎందులో ఎక్కువ లాభం వచ్చిందో తెలుసా ?
Investment : డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా పెంచాలి అనే సందేహం ప్రతి ఒక్కరినీ వేధిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలికంగా చూస్తే ఏది అత్యుత్తమ రాబడిని ఇస్తుందనే దానిపై ఎప్పుడూ చర్చ జరుగుతుంటుంది. మన దేశంలో సాధారణంగా బంగారం, షేర్లు, బ్యాంక్ ఎఫ్‌డీలను ప్రధాన పెట్టుబడి మార్గాలుగా భావిస్తారు. ఈ నేపథ్యంలో వైట్‌ఓక్ క్యాపిటల్ సంస్థ 1985 నుంచి 2025 వరకు అంటే సుమారు 40 సంవత్సరాల కాలంలో ఈ మూడింటి పనితీరును విశ్లేషించింది. ఈ నివేదికలో ద్రవ్యోల్బణం కారణంగా డబ్బు విలువ ఎంత తగ్గింది. ఏ పెట్టుబడి ఎంత పెరిగింది అనే ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి.
వైట్‌ఓక్ క్యాపిటల్ గణాంకాల ప్రకారం.. ఒకవేళ మీరు 1985లో రూ. 100 పెట్టుబడి పెట్టి ఉంటే, 2025 మార్చి నాటికి దాని విలువ సెన్సెక్స్‌లో ఏకంగా రూ. 13,484 కు చేరుకుంది. ఈ 40 ఏళ్ల ప్రయాణంలో స్టాక్ మార్కెట్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, దీర్ఘకాలంలో మాత్రం ఇది అన్నింటికంటే గరిష్ట లాభాలను అందించింది. రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండి, ఓపికగా ఉండేవారికి షేర్ మార్కెట్ అనేది సంపదను సృష్టించడానికి అతిపెద్ద వేదిక అని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక బంగారం విషయానికి వస్తే.. 1985లో పెట్టిన రూ. 100 పెట్టుబడి ఇప్పుడు రూ. 6,518 గా మారింది. బంగారం ఎప్పుడూ తన విలువను నిలబెట్టుకుంటూ స్థిరమైన వృద్ధిని కనబరుస్తుందని ఈ డేటా నిరూపించింది. ఈ 40 ఏళ్లలో బంగారం దాదాపు 10 నుంచి 12 శాతం మేర వార్షిక వృద్ధిని నమోదు చేస్తూ వచ్చింది. అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా, అదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే సాధనంగా బంగారం తన పట్టును నిరూపించుకుంది. షేర్ల కంటే తక్కువ రిస్క్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది.
అయితే, అందరూ సురక్షితంగా భావించే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు మాత్రం ఈ రేసులో చాలా వెనుకబడి ఉన్నాయి. 1985లో ఎఫ్‌డీలో పెట్టిన రూ. 100 విలువ 2025 నాటికి కేవలం రూ. 2,100 మాత్రమే అయింది. ఇక్కడ గమనించాల్సిన మరో ప్రధాన అంశం ద్రవ్యోల్బణం. 1985లో రూ. 100 తో కొనే వస్తువుల ధర, ద్రవ్యోల్బణం కారణంగా ఈ రోజు రూ. 1,478 కు చేరింది. అంటే మీ ఎఫ్‌డీ కేవలం ద్రవ్యోల్బణం కంటే కొద్దిగా మాత్రమే ఎక్కువ లాభాన్ని ఇచ్చింది. దీనివల్ల వాస్తవ రూపంలో మీ సంపద పెద్దగా పెరగలేదని చెప్పవచ్చు.
ముగింపుగా చూస్తే.. ద్రవ్యోల్బణాన్ని దాటుకుని భారీగా సంపదను కూడబెట్టాలంటే షేర్లు (సెన్సెక్స్) సరైన మార్గమని, అలాగే స్థిరత్వంతో పాటు మంచి రాబడి కావాలంటే బంగారం రెండో ఉత్తమ ఎంపికని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. కేవలం ఎఫ్‌డీలపైనే ఆధారపడితే దీర్ఘకాలంలో మన డబ్బు విలువ పెరగడం కంటే ఉన్న విలువను కాపాడుకోవడం కూడా కష్టమవ్వచ్చు. అందుకే నిపుణులు తమ పెట్టుబడులను ఒకే చోట కాకుండా బంగారం, షేర్ల మధ్య వైవిధ్యంగా పంచుకోవాలని సూచిస్తున్నారు.