IDBI Bank : పాత అప్పులు తీరి.. ఇప్పుడు లాభాల్లోకి.. అమ్మకానికి ప్రభుత్వ బ్యాంక్.
IDBI Bank : భారత ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా విక్రయించాలని ప్రయత్నిస్తున్న ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ ప్రైవేటీకరణ ప్రక్రియ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఈ బ్యాంక్‌లో తమ మెజారిటీ వాటాను విక్రయించడం ద్వారా కేంద్రం దాదాపు రూ.64 వేల కోట్లు (7.1 బిలియన్ డాలర్లు) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ లావాదేవీ విజయవంతమైతే దశాబ్దాల తర్వాత ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసిన మొట్టమొదటి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఐడీబీఐ అవుతుంది. ఒకప్పుడు భారీ అప్పుల్లో మునిగిపోయిన ఈ బ్యాంక్, ఇటీవలి కాలంలో ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయం, కఠినమైన చర్యల ద్వారా నిరర్థక ఆస్తులు తగ్గించుకొని లాభాల బాట పట్టింది.
రేసులో ఎవరున్నారు?
కేంద్ర ప్రభుత్వం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తో కలిసి ఈ బ్యాంక్‌లో తమకున్న మొత్తం వాటాలో 60.72 శాతం విక్రయించాలని చూస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వానికి, ఎల్‌ఐసీకి కలిపి బ్యాంక్‌లో దాదాపు 95% వాటా ఉంది. ఇందులో కేంద్రం 30.48% వాటాను, LIC 30.24% వాటాను విక్రయించబోతున్నాయి. మేనేజ్‌మెంట్ నియంత్రణను కూడా కొనుగోలుదారుకు అప్పగించనున్నారు. ఐడీబీఐ బ్యాంక్‌ను కొనుగోలు చేయడానికి కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, ఎమిరేట్స్ ఎన్‌బిడి పీజేఎస్‌సి, ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ వంటి సంస్థలు ఆసక్తి చూపాయి. ఈ రేసులో ఆసియాలోని అత్యంత ధనవంతులైన బ్యాంకర్లలో ఒకరైన ఉదయ్ కోటక్ నేతృత్వంలోని కోటక్ బ్యాంక్ ముందున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఎప్పటిలోగా పూర్తవుతుంది?
ప్రస్తుతానికి ఎంపిక చేసిన బిడ్డర్లు బ్యాంక్ వివరాలను పరిశీలిస్తున్నారు. రెగ్యులేటరీ ఆమోదాలు ఆలస్యం కావడం వల్ల ప్రభుత్వం గతంలో నిర్దేశించిన గడువును కోల్పోయింది. అయితే, అధికారులు మాత్రం ఈ విక్రయ ప్రక్రియను మార్చి 2026తో ముగిసే ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విజేత బిడ్డర్‌ను వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ, పూర్తి ఆమోదాలు, ఇతర అనుమతులు వచ్చే వరకు లావాదేవీ పూర్తి కావడానికి ఇంకా ఆలస్యం కావచ్చు.