GST Collection : రికార్డు క్రియేట్ చేసిన జీఎస్టీ వసూళ్లు..ప్రభుత్వ ఖజానాకు రూ. 1.89 లక్షల కోట్లు

Update: 2025-10-02 05:45 GMT

GST Collection : కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ వసూళ్ల రూపంలో గుడ్ న్యూస్ అందింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 2025 నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.89 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది వరుసగా రెండో నెలలో రూ. 1.85 లక్షల కోట్లకు పైగా వసూలవడం విశేషం. ఈ రికార్డు వసూళ్లు దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనే సంకేతాలను ఇస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 2025లో జీఎస్టీ కలెక్షన్లు రూ. 1.89 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో వసూలైన రూ. 1.73 లక్షల కోట్లతో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి. దీనికి ముందు ఆగస్టులో కూడా రూ. 1.86 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. ఇది వార్షిక ప్రాతిపదికన 6.5% పెరుగుదలను సూచిస్తోంది.

ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2025 వరకు) దేశ మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ. 12.1 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది దాదాపు 9.8% అధికం. ట్యాక్స్ రిఫండ్‌లు తీసివేయగా మిగిలిన నికర ఆదాయం ఈ ఆరు నెలల్లో రూ. 10.4 లక్షల కోట్లుగా ఉంది, ఇది గత సంవత్సరం కంటే 8.8% ఎక్కువ. ఈ పెరుగుదల ప్రభుత్వ ఖజానా బలపడుతోందని సూచిస్తుంది.

ఐజీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది తొలిసారిగా రూ. 1 లక్ష కోట్ల మార్కును దాటాయి. సెప్టెంబర్‌లో ఐజీఎస్టీ వసూళ్లు రూ. 1,01,883 కోట్లుగా నమోదయ్యాయి, ఇది జనవరి 2025లో నమోదైన పాత రికార్డు (రూ. 1,01,075 కోట్లు) కంటే ఎక్కువ. దేశంలోని రాష్ట్రాల మధ్య వాణిజ్యం, వస్తువుల మార్పిడి పెరగడాన్ని ఇది సూచిస్తుంది. అయితే, సెస్ వసూళ్లు మాత్రం ఏప్రిల్ (రూ. 13,451 కోట్లు) నుంచి సెప్టెంబర్ (రూ. 11,652 కోట్లు) మధ్య స్వల్పంగా తగ్గాయి. అయినప్పటికీ, మొత్తం జీఎస్టీ వసూళ్లపై దీని ప్రభావం పెద్దగా లేదు.

ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చిన పండుగల సీజన్ కారణంగా జీఎస్టీ ఆదాయం రూ. 3.8 లక్షల కోట్లకు పెరిగింది, ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 7.8% ఎక్కువ. పండుగల సందర్భంగా మార్కెట్‌లో కొనుగోళ్లు పెరగడం వల్ల ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్స్ ఆదాయం లభించింది. ముఖ్యంగా, సెప్టెంబర్ ప్రారంభంలో జీఎస్టీ మండలి ట్యాక్స్ స్లాబ్‌లలో పెద్ద మార్పులు చేసింది. గతంలో ఉన్న 5%, 12%, 18%, 28% అనే నాలుగు వేర్వేరు స్లాబ్‌లను కేవలం రెండు ప్రధాన స్లాబ్‌లుగా (5% మరియు 18%) మార్చారు. లగ్జరీ వస్తువులు, ఆరోగ్యానికి హాని కలిగించే వస్తువులపై 40% ట్యాక్స్ విధించారు. సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వచ్చిన ఈ సంస్కరణలు ట్యాక్స్ విధానాన్ని సులభతరం చేయడానికీ, వ్యాపారులకు, వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికీ ఉద్దేశించబడ్డాయి.

Tags:    

Similar News