Hyundai : రోడ్ల మీద ఎక్కడ చూసినా వెన్యూనేనా? జనవరిలో హుందాయ్ సేల్స్ సునామీ.
Hyundai : హుందాయ్ మోటార్ ఇండియా 2026 జనవరిలో ఊహించని రీతిలో అమ్మకాలను జరిపింది. మొత్తం 73,137 యూనిట్ల విక్రయాలతో కంపెనీ చరిత్రలోనే ఇది ఒక మైలురాయిగా నిలిచింది. గతేడాది జనవరితో పోలిస్తే అమ్మకాలు 11.5 శాతం పెరిగాయి. ఇందులో దేశీయ అమ్మకాలు 59,107 యూనిట్లు కాగా, విదేశాలకు ఎగుమతి చేసినవి 14,030 యూనిట్లు. ఈ భారీ విజయంలో హుందాయ్ వెన్యూ స్టార్ ప్లేయర్‌గా నిలిచింది. ఒక్క జనవరి నెలలోనే 12,413 వెన్యూ కార్లు అమ్ముడయ్యాయి. 2019లో ఈ కారు లాంచ్ అయిన తర్వాత ఇదే అత్యధిక నెలవారీ విక్రయం కావడం విశేషం.
నవంబర్ 2025లో విడుదలైన కొత్త జనరేషన్ హుందాయ్ వెన్యూ, వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. దీని ప్రారంభ ధర రూ.7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కావడంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా దీని వైపు మొగ్గు చూపుతున్నారు. పాత మోడల్ కంటే ఇది చాలా బోల్డ్, మోడ్రన్ లుక్‌లో కనిపిస్తుంది. ముందు భాగంలో ఉండే సి-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, కొత్త గ్రిల్ డిజైన్ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. యువతను దృష్టిలో పెట్టుకుని హుందాయ్ చేసిన ఈ మార్పులు అమ్మకాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వెన్యూ ఇంటీరియర్ ఇప్పుడు చాలా ఫ్యూచరిస్టిక్ గా మారింది. ఇందులో డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్లు, పనోరమిక్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ లెదర్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా సేఫ్టీ విషయంలో హుందాయ్ రాజీ పడలేదు. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS లెవెల్-2 ఫీచర్లను స్టాండర్డ్ గా అందించారు. ఈ ఫీచర్ల వల్ల కియా సోనెట్, టాటా నెక్సాన్ వంటి కార్లకు వెన్యూ గట్టి పోటీని ఇస్తోంది.
ఇంజిన్ ఆప్షన్లు, వేరియంట్లు వెన్యూ కస్టమర్లకు మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లను అందిస్తోంది:
1.2-లీటర్ పెట్రోల్: సిటీ డ్రైవింగ్ కోసం ఉత్తమమైనది.
1.0-లీటర్ టర్బో-పెట్రోల్: వేగాన్ని ఇష్టపడే వారి కోసం.
1.5-లీటర్ డీజిల్: లాంగ్ జర్నీలు చేసే వారికి, ఎక్కువ మైలేజీ కోరుకునే వారికి.
మ్యాన్యువల్, ఆటోమేటిక్, డిసిటి ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉండటంతో ప్రతి ఒక్కరూ తమ అవసరానికి తగ్గట్టుగా కారును ఎంచుకోవచ్చు. హుందాయ్ ఎండీ, సీఈఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. జనవరి 2026 అమ్మకాలు హుందాయ్ బ్రాండ్ పై భారతీయులకున్న నమ్మకాన్ని నిరూపించాయని సంతోషం వ్యక్తం చేశారు.