GST: జీఎస్‌టీ మార్పులతో సామాన్యులపై అధిక భారం.. ఏఏ సర్వీసెస్‌పై ఎంతెంత పెరిగిందంటే..?
GST: ఇప్పటికే పెరుగుతున్న ధరలతో జనం అల్లాడుతున్నారు. ఇప్పుడు జీఎస్టీలో మార్పులు సామాన్యులపై మరింత భారం వేయనున్నాయి.;
GST: మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లయ్యింది. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో జనం అల్లాడుతున్నారు. ఇప్పుడు జీఎస్టీలో తెచ్చిన మార్పులు సామాన్యులపై మరింత భారం వేయనున్నాయి. GST కౌన్సిల్ 47వ సమావేశంలో జీఎస్టీ మార్పులపై నిర్ణయం తీసుకున్నారు. ఆ మార్పులు సోమవారం నుంచి అమలులోకి వచ్చేశాయి. ఇక నుంచి బ్యాంకుల నుంచి చెక్ బుక్ తీసుకోవాలన్న ఇకపై 18 శాతం జీఎస్‌టీ పడనుంది.
ఆసుపత్రుల్లో చికిత్స కూడా కాస్లీ అయ్యింది. రోజుకు 5వేల కంటే ఎక్కువ అద్దె ఉన్న ఆసుపత్రుల నాన్-ఐసియు గదులకు 5% GST చెల్లించాల్సి ఉంటుంది. హోటల్స్ రూమ్స్ కూడా పెరగనున్నాయి. రోజుకు రూ. 1000 లోపు రెంట్ కలిగిన హోటల్ రూమ్స్‌పై 12 శాతం జీఎస్‌టీ విధించారు. ప్రింటింగ్, రైటింగ్, డ్రాయింగ్ ఇంక్, ఎల్ఈడీ లైట్లు, ఎల్ఈడీ ల్యాంప్స్‌పై 18 శాతం జీఎస్‌టీ చెల్లించాలి.
ప్యాక్ చేసి విక్రయించే ఆహార ఉత్పత్తుల ధరలు కూడా పెరిగాయి. అప్పడాలు, జంతికలు, మిక్చర్ నుంచి ఆటా పిండి, బియ్యం, గోధుమలు, పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్, బెల్లం, తేనె వరకు అన్నింటిపై 18 శాతం జీఎస్టీ ఫిక్స్ చేశారు. మ్యాప్‌లు, చార్ట్‌లు, అట్లాస్‌ల కొనలన్నా 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే. జీఎస్టీలో మార్పులతో కొన్ని వస్తువుల విషయంలో కాస్త రిలీఫ్ దొరుకుతోంది.
రోప్ వేల ద్వారా వస్తువుల రవాణా, ప్రయాణికుల రవాణా సేవలపై 12 శాతం జీఎస్టీ రేటును 5 శాతానికి తగ్గించారు. డిఫెన్స్ ఫోర్స్ కోసం దిగుమతి చేసుకునే పలు ప్రొడక్టులపై ఇకపై ఐజీఎస్‌టీ ఉండదు. ట్రక్కులు, గూడ్స్ క్యారియర్ల అద్దెలపై సర్వీస్ చార్జీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు 5 శాతం రాయితీ కల్పించింది కేంద్రం. కానీ ఇవేవీ సామాన్యులకు పెద్దగా ఉపయోగపడవు.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే తొలిరోజే కేంద్రం జీఎస్టీ పెంచేసింది. రిగిన జీఎస్‌టీ రేట్ల అమలుపై విపక్షం ఫైర్ అవుతోంది. ఓవైపు అధిక పన్నులతో నడ్డివిరుస్తూ మరోవైపు నిత్యావసరాలపై కేంద్రం జీఎస్‌టీని పెంచిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. నిత్యం వాడే ఆహారోత్పత్తులు, నిత్యావసరాలపై పన్ను భారం తగదని మండిపడ్డారు.
భారత ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడంలో బీజేపీ ఆరితేరిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఉపాధి అవకాశాలు కల్పించని ప్రభుత్వం అధిక పన్నుల వడ్డనలో ముందుంటోందని వ్యాఖ్యానించారు. మొత్తానికి కేంద్రం జీఎస్టీ పేరుతో మళ్లీ వడ్డన మొదలు పెట్టేసింది. ఇక జనం జేబులకు చిల్లు పడడటం ఖాయమన్నమాట.