Hero HF Deluxe : స్ప్లెండర్, షైన్ కంటే ఎక్కువ గ్రోత్..ఒక్క నెలలో 91 వేల యూనిట్లు అమ్ముడుపోయిన సామాన్యుడి బైక్.
Hero HF Deluxe : భారతీయ ద్విచక్ర వాహన రంగం 2025 నవంబర్ నెలలో కనువిందు చేసే రీతిలో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 టూ-వీలర్ మోడళ్ల మొత్తం విక్రయాలు 13.26 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో జరిగిన 10.83 లక్షల యూనిట్ల అమ్మకాలతో పోల్చి చూస్తే, ఈ ఏడాది ఏకంగా 22.5 శాతం పెరుగుదల కనిపించడం విశేషం. ఈ జాబితాలో ఎప్పటిలాగే సామాన్యులు ఎక్కువగా ఇష్టపడే కమ్యూటర్ మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు ఆధిపత్యం వహించినప్పటికీ, ఒక మధ్యతరగతి బైక్ మాత్రం విక్రయాల వృద్ధిలో అందరినీ ఆశ్చర్యపరిచేలా దుమ్మురేపింది.
అదేదో బైక్ కాదు.. హీరో మోటోకార్ప్ కు చెందిన హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్. మొత్తం అమ్మకాల జాబితాలో ఈ బైక్ ఆరో స్థానంలో ఉన్నప్పటికీ, వార్షిక వృద్ధి విషయంలో మాత్రం 48.72 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది నవంబర్‌లో కేవలం 61,245 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈ ఏడాది ఏకంగా 91,082 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే దాదాపు సగం విక్రయాలు పెరిగాయి. ఈ గ్రోత్ రేటుతో ఇది తన సొంత అన్న స్ప్లెండర్‌తో పాటు హోండా షైన్, బజాజ్ పల్సర్ వంటి దిగ్గజ బైక్‌లను కూడా వెనక్కి నెట్టి వేగంగా దూసుకుపోయింది.
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఇంతటి విజయాన్ని సాధించడానికి దాని తక్కువ ధర, నమ్మకమైన పనితీరు ప్రధాన కారణం. ఇందులో 97.2సీసీ సామర్థ్యం గల పవర్‌ఫుల్ BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 7.91 bhp పవర్, 8.05 Nm టార్క్‌ను అందిస్తుంది. సుమారు 112 కిలోల బరువు ఉండే ఈ బైక్, 9.6 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సేఫ్టీ కోసం రెండు చక్రాలకు డ్రమ్ బ్రేక్‌లతో పాటు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ సదుపాయం కల్పించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఈ బైక్ ప్రారంభ ధర సుమారు రూ.56,000(ఎక్స్-షోరూమ్)గా ఉండటం మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరటగా మారింది.
కేవలం ధర మాత్రమే కాదు.. ఈ బైక్‌లో హీరో కంపెనీ అందించిన అత్యాధునిక ఫీచర్లు కూడా కస్టమర్లను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా దీని టాప్ వేరియంట్‌లో ఉన్న i3S (Idle Start-Stop System) టెక్నాలజీ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇంజిన్‌ను ఆటోమేటిక్‌గా ఆపివేసి పెట్రోల్ ఆదా చేయడానికి సహాయపడుతుంది. అలాగే బైక్ పడిపోతే ఇంజిన్ ఆగిపోయే సేఫ్టీ ఫీచర్, సైడ్ స్టాండ్ సెన్సార్ వంటి సదుపాయాలు దీనికి తోడయ్యాయి. సింగిల్ పీస్ పొడవైన సీటు ఉండటం వల్ల ఫ్యామిలీతో ప్రయాణించడానికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఆల్ బ్లాక్ వేరియంట్ నుండి i3S ప్రో వేరియంట్ వరకు ఇది ఆన్-రోడ్ రూ.67,201 నుంచి రూ.82,085 ధరల మధ్య లభిస్తోంది.
ప్రస్తుతం మార్కెట్లో బజాజ్ సిటీ 100, టీవీఎస్ స్పోర్ట్, హోండా సీడీ 110 డ్రీమ్ వంటి బైక్‌లు గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ, హెచ్‌ఎఫ్ డీలక్స్ తన జోరును కొనసాగిస్తోంది. ఈ బైక్ మొత్తం 6 వేరియంట్లు, 11 ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉండటం యువతను, గ్రామీణ ప్రజలను సమానంగా ఆకట్టుకుంటోంది. తక్కువ మెయింటెనెన్స్, మంచి మైలేజీ ఇచ్చే బైక్ కావాలనుకునే వారికి ఇది 2026లో కూడా బెస్ట్ ఆప్షన్‌గా నిలవబోతోంది.