Sales Record: జీఎస్టీ తగ్గడంతో రికార్డు సృష్టించిన 3 కార్లు.. అమ్మకాల్లో దుమ్ములేపిన నెక్సాన్, క్రెటా, స్కార్పియో.
Sales Record: భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మూడు ఎస్‍యూవీలు అయిన టాటా నెక్సాన్, హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియోలు అమ్మకాల్లో కొత్త రికార్డులను సృష్టించాయి. జీఎస్‌టీ రేట్లను తగ్గించడం, కంపెనీలు ఇచ్చిన పండుగ ఆఫర్ల కారణంగా సెప్టెంబర్ 2025 నెలలో వీటి అమ్మకాలు చరిత్రలోనే అత్యధికంగా నమోదయ్యాయి. ఈ ఒక్క నెలలోనే నెక్సాన్ 22,573 యూనిట్లు, క్రెటా 18,861 యూనిట్లు, స్కార్పియో (N + క్లాసిక్ కలిపి) 18,372 యూనిట్లు అమ్ముడయ్యాయి.
సెప్టెంబర్ 2025 లో జరిగిన మొత్తం అమ్మకాల్లో ఈ మూడు ఎస్‍యూవీలు తమ కంపెనీలకు బలమైన అండగా నిలిచాయి. టాటా మోటార్స్ మొత్తం ప్యాసింజర్ వెహికల్ (PV) అమ్మకాలలో నెక్సాన్ వాటా ఏకంగా 37.83% ఉంది. టాటా మొత్తం అమ్మకాలు 59,667 యూనిట్లు. హ్యుందాయ్ ఇండియా మొత్తం అమ్మకాలలో క్రెటా వాటా 36.59% ఉంది. హ్యుందాయ్ మొత్తం అమ్మకాలు 51,547 యూనిట్లు. మహీంద్రా మొత్తం ఎస్‍యూవీ అమ్మకాలలో స్కార్పియో వాటా 32.67% ఉంది. మహీంద్రా మొత్తం అమ్మకాలు 56,233 యూనిట్లు. సెప్టెంబర్‌లో నెక్సాన్ అమ్మకాలు టాటా మోటార్స్ చరిత్రలోనే ఏ కారుకు అయినా నమోదైన అత్యధిక నెలవారీ అమ్మకాలు కావడం విశేషం.
జీఎస్టీ తగ్గింపుతో ఎంత లాభం?
ప్రభుత్వం జీఎస్‌టీ 2.0 ను అమలు చేసిన తరువాత, ఈ కార్ల ధరలు గణనీయంగా తగ్గాయి. దీనికి తోడు కంపెనీలు అదనపు ఆఫర్లను కూడా ఇవ్వడంతో అమ్మకాలు పెరిగాయి.
టాటా నెక్సాన్: దీని ధర రూ.1.55 లక్షల వరకు తగ్గింది. ఇప్పుడు దీని ప్రారంభ ధర రూ.7.32 లక్షలు (ఎక్స్-షోరూమ్). సెప్టెంబర్‌లో రూ.45,000 వరకు అదనపు తగ్గింపులు కూడా లభించాయి.
మహీంద్రా స్కార్పియో: స్కార్పియో క్లాసిక్ ధర రూ.1.01 లక్షల వరకు తగ్గి, ఇప్పుడు రూ.12.98 లక్షల నుంచి మొదలవుతోంది. స్కార్పియో N ధర రూ.1.45 లక్షల వరకు తగ్గి, ఇప్పుడు రూ.13.20 లక్షల నుంచి మొదలవుతోంది. వీటిపై సెప్టెంబర్‌లో రూ.95,000 (క్లాసిక్), రూ.71,000 (N) వరకు ఆఫర్లు ఇచ్చారు.
హ్యుందాయ్ క్రెటా: దీని ధర రూ.72,145 వరకు తగ్గి, ఇప్పుడు ప్రారంభ ధర రూ.10.73 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.
టాప్ 5 అత్యధికంగా అమ్ముడైన కార్లు
సెప్టెంబర్ 2025లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 కార్లు ఇవిగో:
టాటా నెక్సాన్ – 22,573 యూనిట్లు
మారుతి సుజుకి డిజైర్ – 20,038 యూనిట్లు
హ్యుందాయ్ క్రెటా – 18,861 యూనిట్లు
మహీంద్రా స్కార్పియో – 18,372 యూనిట్లు
టాటా పంచ్ – 15,891 యూనిట్లు
ఈ డేటా ప్రకారం, టాప్ 5 లిస్ట్‌లో మూడు ఎస్‍యూవీలే ఉండటం భారత మార్కెట్‌లో ఎస్‍యూవీల డిమాండ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది.