Holi 2026 : రంగుల పండుగలో కాసుల వర్షం.. ఈ ఏడాది రూ.80,000 కోట్ల టర్నోవర్ ఖాయం.

Update: 2026-03-04 05:30 GMT

Holi 2026 : రంగుల పండుగ హోలీ కేవలం ఆనందానికి, స్నేహానికి ప్రతీక మాత్రమే కాదు.. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ఒక భారీ బూస్టర్ డోస్‌లా మారుతోంది. ఈ ఏడాది హోలీ సందర్భంగా దేశవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు మునుపెన్నడూ లేని రీతిలో సాగుతున్నాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా ప్రకారం, ఈ ఏడాది హోలీ సీజన్‌లో దేశవ్యాప్తంగా దాదాపు రూ.80,000 కోట్లకు పైగా వ్యాపారం జరగనుంది. ఇది భారతీయ పండుగలకు ఉన్న ఆర్థిక సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెబుతోంది. మెట్రో నగరాల నుంచి పల్లెల వరకు ప్రతిచోటా మార్కెట్లు కస్టమర్లతో కిక్కిరిసిపోతున్నాయి.

హోలీ అంటేనే రంగులు. ఈసారి మార్కెట్‌లో రంగుల ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. గతంలో రసాయన రంగుల జోరు ఉండేది, కానీ ఇప్పుడు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో హర్బల్, ఆర్గానిక్, కెమికల్-ఫ్రీ రంగులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చిన్న ప్యాకెట్ల నుంచి ఫ్యామిలీ ప్యాక్ ల వరకు రంగుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రంగులతో పాటు పిచకారీలు (వాటర్ గన్స్) పిల్లలను కట్టిపడేస్తున్నాయి. విభిన్న డిజైన్లు, కార్టూన్ క్యారెక్టర్లు, హై-ప్రెజర్ వాటర్ గన్స్ మార్కెట్లలో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పిల్లల కోసం రంగు రంగుల బెలూన్లు, ముఖానికి వేసుకునే మాస్కులు కూడా భారీగా అమ్ముడవుతున్నాయి.

దుస్తుల మార్కెట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హోలీ రోజున తెల్లటి కుర్తాలు, టీ-షర్టులు వేసుకోవడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా యువత కోసం హోలీ స్పెషల్ థీమ్ ప్రింటెడ్ టీ-షర్టులు, స్లోగన్లతో కూడిన దుస్తులు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. దీనివల్ల టెక్స్‌టైల్ రంగానికి భారీగా ఆర్డర్లు అందుతున్నాయి. ఇక పండుగ అంటే పిండివంటలు ఉండాల్సిందే కదా! హోలీ స్పెషల్ స్వీట్ 'గుజియా' విక్రయాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో పాటు తినుబండారాల అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి. స్వీట్ షాపులు, స్థానిక కుటీర పరిశ్రమలకు ఈ సీజన్ కనకవర్షం కురిపిస్తోంది.

ఈ ఏడాది మరో విశేషం ఏమిటంటే.. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకే కస్టమర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. విదేశీ వస్తువుల కంటే స్థానిక కళాకారులు, చిన్న వ్యాపారులు తయారు చేసిన స్వదేశీ పిచకారీలు, రంగులనే జనం ఎక్కువగా కొంటున్నారు. దీనివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. అపార్ట్‌మెంట్లలో జరిగే హోలీ మిలన్ వేడుకలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, క్యాటరింగ్ సర్వీసులు, సౌండ్ సిస్టమ్స్ వంటి చిన్న తరహా వ్యాపారాలకు కూడా ఈ పండుగ భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. మొత్తానికి హోలీ పండుగ రంగులతో పాటు వ్యాపారుల జీవితాల్లో లాభాల వెలుగులను కూడా నింపుతోంది.

Tags:    

Similar News