Tata Nexon : మార్కెట్‌లో టాటా నెక్సాన్ సునామీ.. గాల్లో కలిసిన మారుతి డిజైర్, క్రెటాల రికార్డులు.

Update: 2026-03-03 10:45 GMT

Tata Nexon : కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ఏయే కార్లకు ఫుల్ డిమాండ్ ఉందో, జనం ఏ మోడల్స్ కోసం ఎగబడుతున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫిబ్రవరి 2026 నెలలో వాహన విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే.. ఎస్‌యూవీల హవా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా టాటా మోటార్స్ తన సత్తా చాటుతూ మారుతి సుజుకి వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చింది. ఈ క్రమంలో గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్ల వివరాలను ఇప్పుడు చూద్దాం.

ఫిబ్రవరి నెలలో సేల్స్ చార్ట్‌లో టాటా నెక్సాన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మారుతి డిజైర్, హ్యుందాయ్ క్రెటా వంటి పాపులర్ మోడళ్లను వెనక్కి నెట్టి నెక్సాన్ రారాజుగా నిలిచింది. గత నెలలో ఏకంగా 19,430 యూనిట్ల నెక్సాన్ కార్లు అమ్ముడయ్యాయి. ఇక రెండో స్థానంలో మారుతి సుజుకి డిజైర్ నిలిచింది. ఈ సెడాన్ కారు 19,326 యూనిట్ల విక్రయాలతో నెక్సాన్ కు అతి సమీపంలో నిలబడింది. మూడో స్థానంలో టాటా నుంచే వచ్చిన మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ 18,748 యూనిట్ల సేల్స్‌తో అదరగొట్టింది.

టాప్-5లో మిగిలిన రెండు స్థానాలను పరిశీలిస్తే.. నాలుగో స్థానంలో ఎస్‌యూవీ కింగ్ హ్యుందాయ్ క్రెటా నిలిచింది. గత నెలలో 17,938 యూనిట్ల క్రెటా కార్లు రోడ్డెక్కాయి. ఇక ఐదో స్థానంలో మారుతి సుజుకి బ్రెజ్జా 17,863 యూనిట్ల విక్రయాలతో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే మొదటి ఐదు స్థానాల్లో నాలుగు ఎస్‌యూవీలే ఉండటం గమనార్హం.

ఇక టాప్-10 జాబితాలోని మిగిలిన కార్ల విషయానికి వస్తే.. ఫ్యామిలీ కారుగా పేరుగాంచిన మారుతి సుజుకి ఎర్టిగా 17,807 యూనిట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ఏడో స్థానంలో మారుతి వ్యాగన్ ఆర్ (14,885 యూనిట్లు), ఎనిమిదో స్థానంలో మారుతి స్విఫ్ట్ (14,833 యూనిట్లు) నిలిచాయి. మహీంద్రా కంపెనీ నుంచి వచ్చిన స్కార్పియో 14,665 యూనిట్ల విక్రయాలతో తొమ్మిదో స్థానంలో నిలవగా, మారుతి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో 14,632 యూనిట్లతో పదో స్థానంలో నిలిచింది. మొత్తానికి మార్కెట్‌లో టాటా మోటార్స్, మారుతి సుజుకి మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది.

Tags:    

Similar News