Mercedes-Benz : మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ రీ-ఎంట్రీ.. రూ.1.4 కోట్లతో లగ్జరీకి ఇది సరికొత్త చిరునామా.

Update: 2026-03-03 10:15 GMT

Mercedes-Benz : భారతదేశపు లగ్జరీ కార్ల మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ మరోసారి తన పట్టును నిరూపించుకుంది. అత్యంత విలాసవంతమైన మల్టీ పర్పస్ వెహికల్ వి-క్లాస్‎ను సరికొత్త హంగులతో మళ్ళీ మార్కెట్లోకి విడుదల చేసింది. సుమారు నాలుగేళ్ల విరామం తర్వాత, 2026 మోడల్‌గా భారత్‌లోకి అడుగుపెట్టిన ఈ కారు ఎక్స్-షోరూమ్ ధరను రూ.1.4 కోట్లుగా నిర్ణయించారు. దీనికి సంబంధించి బుకింగ్స్ ఇప్పటికే మొదలవగా, మార్చి నెలాఖరు నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. పుణెలోని చాకన్ ప్లాంట్‌లో దీనిని లోకల్‌గా అసెంబుల్ చేయడం విశేషం.

డిజైన్ విషయానికి వస్తే, భారత్‌లో ఇది కేవలం ఎక్స్‌ట్రా-లాంగ్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుంది. దీని వీల్‌బేస్ 3,430 మిమీ, అంటే మెర్సిడెస్ నుంచి వస్తున్న అన్ని ప్యాసింజర్ కార్ల కంటే ఇదే అత్యంత పొడవైనది. 5,370 మిమీ పొడవు, 1,928 మిమీ వెడల్పుతో రోడ్డుపై వెళ్తుంటే ఈ కారు ఒక రాజసంలా కనిపిస్తుంది. దీనికి ఏఎమ్‌జీ లైన్ స్టైలింగ్, మల్టీ-బీమ్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, స్పోర్టీ బంపర్లు మరింత ఆకర్షణను ఇస్తున్నాయి. వెనుక భాగంలో ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ ఉంది, అలాగే చిన్న వస్తువులను తీసుకోవడానికి వీలుగా వెనుక గ్లాసును విడిగా తెరుచుకునే వెసులుబాటు ఉంది.

లోపలి కేబిన్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ గదిని తలపిస్తుంది. ఇందులో 4-సీటర్, 6-సీటర్ ఆప్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా 4-సీటర్ వెర్షన్‌లో వెనుక వైపు రెండు కెప్టెన్ సీట్లు ఉంటాయి. వీటిలో మసాజ్ ఫీచర్, హీటింగ్, వెంటిలేషన్, లెగ్ రెస్ట్ వంటి సదుపాయాలు ఉన్నాయి. 6-సీటర్ వెర్షన్‌లో మధ్య సీట్లను మనకు నచ్చినట్లుగా వెనక్కి, ముందుకు లేదా ముఖాముఖిగా తిప్పుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ కోసం 15-స్పీకర్ల బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్ అమర్చారు. డ్యాష్‌బోర్డ్‌పై రెండు 12.3 అంగుళాల స్క్రీన్‌లు ఉంటాయి, ఇవి వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేస్తాయి.

సేఫ్టీ విషయంలో మెర్సిడెస్ ఎక్కడా తగ్గలేదు. యూరో ఎన్‌క్యాప్ (Euro NCAP) నుండి 5-స్టార్ రేటింగ్ పొందిన ఈ కారులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీల కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటర్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. డ్రైవర్ ఏకాగ్రతను గమనించేందుకు ప్రత్యేకంగా డ్రైవర్ మానిటరింగ్ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. భారతీయ రోడ్లకు అనుగుణంగా ట్యూన్ చేసిన ఎయిర్‌మాటిక్ (Airmatic) ఎయిర్ సస్పెన్షన్ ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తుంది.

ఇంజన్ సామర్థ్యాన్ని చూస్తే, ఇందులో రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి 233 bhp పవర్‌ ఇచ్చే 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ (V300d), మరొకటి 228 bhp పవర్‌ ఇచ్చే 2.0 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్ (V300). రెండూ కూడా 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తాయి. లగ్జరీగా ప్రయాణించాలనుకునే వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలను దృష్టిలో ఉంచుకుని మెర్సిడెస్ దీనిని రూపొందించింది. మార్కెట్లో ఇది టొయోటా వెల్‌ఫైర్, లెక్సస్ ఎల్‌ఎమ్ వంటి ఖరీదైన కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Tags:    

Similar News