Home Loan : మెట్రో స్టేషన్ పక్కనే ఇల్లుందా? అయితే హోమ్ లోన్ ఈఎంఐలు వాటంతట అవే కట్టేయొచ్చు.
Home Loan : మెట్రో రైలు అంటే కేవలం వేగంగా ప్రయాణించే సాధనం మాత్రమే కాదు, అది మీ ఇంటి ఆర్థిక కష్టాలను తీర్చే ఒక అద్భుతమైన మార్గం కూడా. మీ ఇల్లు గనుక మెట్రో స్టేషన్ దగ్గర ఉంటే, మీరు తీసుకున్న హోమ్ లోన్ ఈఎంఐ గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విడుదల చేసిన ఒక నివేదిక ఈ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. మెట్రో అందుబాటులోకి రావడం వల్ల ప్రజల పొదుపు పెరగడమే కాకుండా, అప్పులు తీర్చే సామర్థ్యం కూడా మెరుగుపడిందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
సాధారణంగా మెట్రో వల్ల ప్రయాణం సులభం అవుతుందని, ట్రాఫిక్ తగ్గుతుందని మనకు తెలుసు. కానీ, దీని వెనుక ఒక భారీ ఆర్థిక ప్రయోజనం దాగి ఉందని EAC-PM నివేదిక వివరిస్తోంది. మెట్రో స్టేషన్ దగ్గర నివసించే వారు సొంత కార్లు లేదా బైక్‌లపై ఆధారపడటం తగ్గించేశారు. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ఖర్చులే కాకుండా, వాహనాల మెయింటెనెన్స్, పార్కింగ్ ఫీజులు, కొత్త వాహనాల కోసం తీసుకునే లోన్ల భారం కూడా తప్పింది. ఇలా నెలకు వేల రూపాయలు ఆదా కావడంతో, ఆ డబ్బును ప్రజలు తమ హోమ్ లోన్ ఈఎంఐలు సకాలంలో కట్టడానికి ఉపయోగిస్తున్నారు. అంటే రవాణా ఖర్చుల్లో మిగిలిన సొమ్మే మీ ఇంటి అప్పును తీరుస్తోందన్నమాట.
ఈ అధ్యయనంలో భాగంగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలను నిశితంగా పరిశీలించారు. ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో మెట్రో అందుబాటులోకి వచ్చాక హోమ్ లోన్ కట్టలేక డిఫాల్ట్ అయ్యే వారి సంఖ్య 1.7 శాతం తగ్గింది. అంతేకాదు ఈఎంఐ కంటే ముందే లోన్ క్లియర్ చేసే వారి సంఖ్య 1.8 శాతం పెరిగింది. బెంగళూరులో లోన్ డిఫాల్ట్‌లు 2.4 శాతం తగ్గగా, ఢిల్లీలో ఏకంగా 4.42 శాతం మేర అప్పులు ఎగ్గొట్టే వారి సంఖ్య తగ్గిందని ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ వర్కింగ్ పేపర్ వెల్లడించింది.
మెట్రో నెట్‌వర్క్ పెరిగిన ప్రాంతాల్లో కొత్త కార్లు, టూ-వీలర్ల కొనుగోలు గణనీయంగా తగ్గిందని నివేదిక పేర్కొంది. ప్రజలు వ్యక్తిగత వాహనాల కంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాల నెలవారీ ఆదాయంపై ఒత్తిడి తగ్గింది. గత దశాబ్ద కాలంలో మెట్రో వంటి పట్టణ మౌలిక సదుపాయాలపై పెట్టిన పెట్టుబడులు, సామాన్యుల ఆర్థిక స్థితిగతులను ఎలా మార్చేశాయో ఈ నివేదిక అద్దం పడుతోంది. ఎస్‌బీఐ ఆర్థికవేత్త ఫల్గుణి సిన్హా, సౌమ్య కాంతి ఘోష్ మరియు పులక్ ఘోష్‌లు కలిసి ఈ నివేదికను రూపొందించారు.