Honda Elevate : హోండా ఎలివేట్ ధరల బాదుడు..ఏకంగా రూ. 60 వేల వరకు పెంపు.

Update: 2026-01-14 05:45 GMT

Honda Elevate : ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా, తన పాపులర్ ఎస్‌యూవీ ఎలివేట్ ధరలను ఏకంగా 5.5 శాతం వరకు పెంచేసింది. కొత్త ఏడాదిలో కొత్త కారు కొనాలనుకునే మధ్యతరగతి కస్టమర్లకు ఇది నిజంగా పెద్ద దెబ్బే అని చెప్పాలి. వివిధ వేరియంట్లను బట్టి ధరల పెంపు భిన్నంగా ఉంది. అయితే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. ఈ పెంపు ప్రభావం కారు బేస్ వేరియంట్‌పైనే అత్యధికంగా పడింది. మీరు ఈ కారును ప్లాన్ చేస్తుంటే, మీ బడ్జెట్‌లో కనీసం రూ.10 వేల నుండి రూ.60 వేల వరకు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

హోండా ఎలివేట్ ప్రారంభ ధర (SV వేరియంట్) ఇప్పటివరకు రూ.10,99,900 (ఎక్స్-షోరూమ్)గా ఉండేది. కానీ తాజా పెంపు తర్వాత దీని ధర రూ.11,59,890 కి చేరింది. అంటే బేస్ మోడల్ కొనేవారు ఏకంగా రూ.59,990 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా టాప్ మోడల్స్ ధరలు ఎక్కువగా పెరుగుతుంటాయి, కానీ హోండా మాత్రం ఎంట్రీ లెవల్ కారుపైనే ఎక్కువ భారం వేసింది. దీనివల్ల బడ్జెట్ తక్కువగా ఉన్న కస్టమర్లు ఇతర ఆప్షన్ల వైపు చూసే అవకాశం ఉంది.

ఎలివేట్ లోని V గ్రేడ్ వేరియంట్ ధర రూ.9,990 పెరిగింది. దీని మాన్యువల్ ధర రూ.12.06 లక్షలకు, ఆటోమేటిక్ ధర రూ.13.22 లక్షలకు చేరింది. అదేవిధంగా VX గ్రేడ్ ధర రూ.13,590 పెరగడంతో, మాన్యువల్ ధర రూ.13.75 లక్షలు, సీవీటీ ధర రూ.14.91 లక్షలుగా మారింది. ఇక టాప్ ఎండ్ ZX వేరియంట్ విషయానికి వస్తే, మాన్యువల్, ఆటోమేటిక్ రెండింటిపై రూ.9,990 పెరిగింది. వీటి ధరలు వరుసగా రూ.14.98 లక్షలు, రూ.16.25 లక్షలుగా నిర్ణయించబడ్డాయి. స్పెషల్ ఎడిషన్లైన బ్లాక్, ఏడీవీ (ADV) ఎడిషన్లు కూడా రూ.9,990 ఖరీదైనవిగా మారాయి.

ధరలు పెరిగినప్పటికీ, హోండా ఎలివేట్ తనదైన ముద్ర వేయాలని చూస్తోంది. అయితే ఈ ప్రైస్ రేంజ్‌లో ఇది కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్ వంటి హేమాహేమీలతో తలపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హోండా తీసుకున్న ఈ ధరల పెంపు నిర్ణయం అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఒకవైపు టాటా పంచ్ వంటి కార్లు బడ్జెట్ ధరలో కొత్త ఫీచర్లతో వస్తుంటే, హోండా ధరలను పెంచడం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News