ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా హీరో మోటోకార్ప్‌ను దాటేసింది. సెప్టెంబర్ నెలలో నమోదైన రిటైల్ విక్రయాల్లో హీరో కంటే మెరుగైన అమ్మకాలతో దేశంలోనే అత్యధిక ద్విచక్ర వాహనాలు విక్రయించిన కంపెనీగా అవతరించింది. రిటైల్ సేల్స్‌కు సంబంధించి ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ వెలువరించిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. ఫాడా గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ నెలలో హోండా 62,537 యూనిట్ల విక్రయాలతో 27.73 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా నిలిచింది. హీరో మోటోకార్ప్ 22.54 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే రెండు కంపెనీల విక్రయాలు తగ్గడం గమనార్హం. ఇక టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా టాప్-5లో నిలిచాయి. ఈ ఐదు సంస్థలు కలిపి 86.57 మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. హోల్‌సేల్ విక్రయాల పరంగా ఇప్పటికీ హీరో మోటోకార్ప్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. వాహన్ వెబ్‌సైట్ ఆధారంగా రిటైల్ నంబర్లు రూపొదిస్తుంటారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2.96 లక్షల యూనిట్లను హీరో హోల్ సేల్‌గా విక్రయించగా.. హోండా మాత్రం 2.92 లక్షల యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది.