Honda : హీరో కాదు.. హోండా హవా.. ఒక్క నెలలో 6.50 లక్షల టూ వీలర్లు అమ్మి సరికొత్త రికార్డు.

Update: 2025-11-06 08:00 GMT

Honda : భారతీయ టూ వీలర్ మార్కెట్‌లో అక్టోబర్ 2025లో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సంచలనం సృష్టించింది. ఒక నెలలో ఏకంగా 6,50,596 యూనిట్ల టూ వీలర్లను విక్రయించి, గత ఏడాదితో పోలిస్తే దాదాపు 9 శాతం వృద్ధిని నమోదు చేసింది. పండుగల సీజన్ డిమాండ్, కంపెనీ ఆఫర్లు, ఇటీవల జరిగిన జీఎస్టీ తగ్గింపులు ఈ అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా దేశీయ మార్కెట్‌లో 5,98,952 యూనిట్ల అమ్మకాలతో హోండా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఈ విజయంలో హోండా యాక్టివా కీలక పాత్ర పోషించగా, అమ్మకాల పూర్తి వివరాలు చూద్దాం.

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అక్టోబర్ 2025లో టూ వీలర్ల విక్రయాలలో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ అక్టోబర్‌లో మొత్తం 6,50,596 యూనిట్లను విక్రయించింది. ఇది గతేడాది అక్టోబర్ 2024తో పోలిస్తే సుమారు 9 శాతం ఎక్కువ. దేశీయ మార్కెట్‌లో హోండా 5,98,952 యూనిట్లను విక్రయించింది, ఇది అక్టోబర్ 2024లో విక్రయించిన 5,53,120 యూనిట్ల కంటే 45,800 యూనిట్లు ఎక్కువ. సెప్టెంబర్ 2025తో పోలిస్తే, దేశీయ అమ్మకాల్లో ఏకంగా 18.44 శాతం వృద్ధి నమోదైంది.

ఈ భారీ అమ్మకాల పెరుగుదలకు పండుగల సీజన్ డిమాండ్‌తో పాటు ప్రభుత్వ నిర్ణయాలు కూడా దోహదపడ్డాయి. మీడియా నివేదికల ప్రకారం, దసరా, దీపావళి వంటి పండుగల డిమాండ్ కారణంగా టూ వీలర్ల విక్రయాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో స్కూటర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో బైక్‌లకు డిమాండ్ పెరిగింది. టూ వీలర్లపై జీఎస్టీ రేట్లలో స్వల్ప తగ్గింపు జరగడం వల్ల వాహనాల ధరలు తగ్గడం, ఇది కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా కంపెనీ విక్రయాలకు నేరుగా లబ్ధి చేకూర్చింది.

హోండా అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ బ్రాండ్ యాక్టివా ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. హోండా యాక్టివా ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా 3.5 కోట్ల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించి కొత్త రికార్డు సృష్టించింది. యాక్టివా 110, యాక్టివా 125, యాక్టివా–ఐ వంటి మోడళ్లు ఈ అద్భుత విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి.

దేశీయ అమ్మకాలు పెరిగినప్పటికీ, ఎగుమతుల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. అక్టోబర్‌లో 51,644 యూనిట్లను ఎగుమతి చేశారు. ఇది సెప్టెంబర్ నెలతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ, గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే 15.82% వార్షిక వృద్ధి నమోదైంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2025 వరకు హోండా మొత్తం విక్రయాలు 36.41 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. దేశీయ అమ్మకాల్లో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, ఎగుమతుల్లో 12.9% వృద్ధి కంపెనీ మొత్తం పర్ఫామెన్స్ బ్యాలెన్స్ చేసింది.

Tags:    

Similar News