Money Recovery : ఫ్రెండ్స్ కు డబ్బులిచ్చి అడగలేకపోతున్నావా? స్నేహం చెడకుండానే వసూలు చేసే స్మార్ట్ ప్లాన్ ఇదే.
Money Recovery : స్నేహితులతో కలిసి బయటకెళ్లినప్పుడు అన్నీ బానే ఉంటాయి కానీ, హోటల్ బిల్లు కట్టే దగ్గరే అసలు గొడవ మొదలవుతుంది. "ఇప్పుడు నా దగ్గర చిల్లర లేదురా.. నెట్ రావట్లేదు.. నువ్వు కట్టేయ్, రేపు ఇచ్చేస్తా" అని చెప్పే ఫ్రెండ్స్ ప్రతి గ్యాంగ్‌లోనూ ఒకరు ఉంటారు. ఆ తర్వాత ఆ డబ్బులు అడగలేక, అడిగితే ఎక్కడ స్నేహం చెడిపోతుందోనని భయపడి చాలా మంది తమ సొమ్మును వదిలేసుకుంటారు. కానీ, ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. స్నేహం చెడకుండా, గొడవ పడకుండా మీ డబ్బులు వసూలు చేసుకునే టెక్నిక్స్ ఇక్కడ ఉన్నాయి.
టెక్నాలజీతో వసూల్.. సిగ్గు పడాల్సిన పని లేదు!
మీరు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నప్పుడు లేదా ట్రిప్‌కి వెళ్లినప్పుడు బిల్లు మొత్తాన్ని మీరు కట్టేస్తే, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్ మీకు సహాయం చేస్తాయి. ఈ యాప్స్‌లో Split Bill లేదా Split Expense అనే ఫీచర్ ఉంటుంది. మీరు బిల్లు కట్టిన తర్వాత ఆ గ్రూప్‌లో ఉన్న మిత్రులను సెలెక్ట్ చేస్తే, ఎవరి వాటా ఎంతో ఆ యాప్ లెక్కగట్టి వారికి నోటిఫికేషన్ పంపిస్తుంది. ఇక్కడ మీరు డబ్బులు అడగట్లేదు, యాప్ మాత్రమే వారికి డబ్బులు పెండింగ్ ఉన్నాయి అని గుర్తు చేస్తుంది. దీనివల్ల మీకు మొహమాటం ఉండదు, వారికి బాధ్యత గుర్తుంటుంది.
మొండిగా వ్యవహరిస్తే లీగల్ నోటీసు
చిన్న చిన్న మొత్తాలైతే యాప్స్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. కానీ, ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చి.. వారు ఇప్పుడు ఫోన్ ఎత్తకుండా, డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటుంటే మాత్రం మీరు వెనకడుగు వేయొద్దు. ఇలాంటి సందర్భాల్లో చట్టం మీకు అండగా ఉంటుంది. మొదటి అడుగుగా ఒక లాయర్ ద్వారా లీగల్ నోటీసు పంపండి. అందులో డబ్బులు ఎప్పుడు ఇచ్చారు, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏంటి అనేవి పేర్కొంటూ ఒక డెడ్‌లైన్ ఇవ్వండి. చాలా మంది కోర్టు గొడవలు ఎందుకని ఈ స్టేజ్‌లోనే డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు.
సివిల్ సూట్, క్రిమినల్ కేసులు
లీగల్ నోటీసు పంపినా స్పందన లేకపోతే.. మీరు సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డర్ 37 కింద సివిల్ సూట్ దాఖలు చేయవచ్చు. ఇది ఒక స్పెషల్ కేసు, ఇందులో నిందితుడు 10 రోజుల్లోనే కోర్టుకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మామూలు కేసుల కంటే వేగంగా ముగుస్తుంది. ఒకవేళ అవతలి వ్యక్తి మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశంతోనే అప్పు తీసుకుని ఎగ్గొడితే.. మీరు ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), సెక్షన్ 406 కింద క్రిమినల్ కేసు కూడా పెట్టవచ్చు. దోషిగా తేలితే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.
జాగ్రత్తగా ఉండండి.. సాక్ష్యాలు దాచుకోండి
డబ్బు విషయంలో ఎవరినైనా నమ్మే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. మీరు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపితే దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్లు జాగ్రత్తగా ఉంచుకోండి. నగదు రూపంలో ఇస్తే ఒక ప్రామిసరీ నోట్ లేదా ఏదైనా చిన్న పేపర్ మీద సంతకం తీసుకోవడం మంచిది. కష్టపడి సంపాదించిన డబ్బును తిరిగి అడగడం మీ హక్కు. అందులో మొహమాట పడాల్సిన అవసరమే లేదు. స్మార్ట్‌గా వ్యవహరించి మీ సొమ్మును మీరు దక్కించుకోండి.