Auto Sales 2025 : ఆటో మార్కెట్లో 2025 సునామీ..ఈ 4 కంపెనీల సేల్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే.
Auto Sales 2025 : భారత ఆటోమొబైల్ రంగం 2025 ఏడాదిని ఘనమైన విజయాలతో ముగించింది. ప్యాసింజర్ వాహనాలు, కమర్షియల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ మోడళ్లకు కూడా మార్కెట్లో విపరీతమైన డిమాండ్ కనిపించింది. ముఖ్యంగా నాలుగు కంపెనీలు తమ పాత రికార్డులను తిరగరాస్తూ అద్భుతమైన అమ్మకాలను నమోదు చేశాయి. వినియోగదారుల ఆసక్తికి తగ్గట్టుగా కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడం, ప్రీమియం కార్ల వైపు జనం మొగ్గు చూపడం ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా : 2025లో మహీంద్రా అండ్ మహీంద్రా సంచలనం సృష్టించింది. కేవలం ఎస్‌యూవీల మీదనే దృష్టి పెట్టిన ఈ కంపెనీ, అమ్మకాల్లో టాటా మోటార్స్, హ్యుందాయ్‌లను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకుంది. డిసెంబర్ 2025లో మహీంద్రా మొత్తం 86,090 వాహనాలను విక్రయించి 25% వృద్ధిని నమోదు చేసింది. ఇందులో 50,946 యూనిట్లు కేవలం ప్యాసింజర్ ఎస్‌యూవీలే కావడం విశేషం. స్కార్పియో, థార్, XUV700 వంటి మోడళ్లు కంపెనీకి బంగారు బాతుల్లా మారాయి. ట్రాక్టర్ల విభాగంలో కూడా 31,859 యూనిట్ల విక్రయాలతో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
కియా ఇండియా : కియా ఇండియాకు 2025 డిసెంబర్ నెల అత్యంత చిరస్మరణీయంగా నిలిచింది. గతేడాది డిసెంబర్‌లో కేవలం 8,957 వాహనాలు అమ్ముడవ్వగా, ఈసారి ఆ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి 18,659 యూనిట్లకు చేరింది. భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత కియాకు ఇది అత్యుత్తమ డిసెంబర్ అమ్మకాల రిపోర్ట్. ఏడాది మొత్తం మీద 2,80,286 వాహనాలను విక్రయించిన కియా, కేరెన్స్ మరియు క్లావిస్ వంటి కొత్త మోడళ్ల ద్వారా కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంది.
స్కోడా ఆటో ఇండియా : యూరోపియన్ బ్రాండ్ అయిన స్కోడాకు 2025 ఒక చారిత్రాత్మక ఏడాది. భారతదేశంలో తన 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ, అమ్మకాలను ఏకంగా రెట్టింపు చేసుకుంది. 2024లో 35,166 కార్లు అమ్ముడవ్వగా, 2025లో ఆ సంఖ్య 72,665 యూనిట్లకు చేరి 107% వృద్ధిని నమోదు చేసింది. మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కింద వచ్చిన కుషాక్, స్లావియా, కొత్తగా వచ్చిన కైలాక్ ఎస్‌యూవీలే ఈ భారీ విజయానికి వెన్నెముకగా నిలిచాయి.
JSW MG మోటార్ : JSW తో జట్టుకట్టిన తర్వాత ఎంజీ మోటార్ ఇండియా దూకుడు పెంచింది. 2025లో 19% వృద్ధితో మొత్తం 70,554 వాహనాలను డెలివరీ చేసింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఎంజీ తన సత్తా చాటింది. భారతదేశంలో ఇప్పటివరకు లక్షకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించిన అరుదైన మైలురాయిని ఈ ఏడాది అందుకుంది. విండ్సర్ ఈవీ, కామెట్ ఈవీలకు వస్తున్న స్పందన చూస్తుంటే భవిష్యత్తులో ఎంజీ మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది.