India GDP : ప్రపంచ అంచనాలకు మించి దూసుకుపోతున్న భారత్.. నివేదికలో సంచలన నిజాలు.
India GDP : ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ఈ ఏడాది కూడా స్థిరమైన వృద్ధిని సాధించబోతోందని ప్రముఖ సంస్థలు అంచనా వేస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధిపై కీలక అంచనాను విడుదల చేసింది. అమెరికాలో టారిఫ్‌లు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, భారత్ ఈ ఏడాది 6.7 శాతం నుంచి 6.9 శాతం మధ్య వృద్ధిని నమోదు చేయవచ్చని డెలాయిట్ అంచనా వేసింది.
అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఇండియా తాజాగా ఇండియా ఎకనామిక్ ఔట్‌లుక్ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతం నుంచి 6.9 శాతం మధ్య ఉండవచ్చు. సగటున ఇది 6.8 శాతం వద్ద నమోదయ్యే అవకాశం ఉంది.
డెలాయిట్ సంస్థ గతంలో చేసిన అంచనా కంటే ఇది 30 బేసిస్ పాయింట్లు ఎక్కువ. అంటే, భారత్ మరింత బలమైన ఆర్థిక వృద్ధిని సాధించబోతోందని ఈ సంస్థ భావిస్తోంది. భారత్ వృద్ధిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు, ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా సానుకూల అంచనాలను ప్రకటించాయి.
ఆర్బీఐ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 6.8 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి తన తాజా నివేదికలో భారత జీడీపీ వృద్ధి రేటును 6.4 శాతం నుంచి 6.6 శాతంకు పెంచింది. ఈ పెరుగుదల భారతదేశ బలమైన ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ సంస్థలకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.
అదేవిధంగా, ప్రపంచ బ్యాంక్ కూడా భారత వృద్ధి అంచనాను 6.3 శాతం నుంచి 6.5 శాతంకు పెంచింది. వివిధ సంస్థలు, ఆర్థిక నిపుణుల అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.3 శాతం నుంచి 6.9 శాతం పరిధిలో పెరిగే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్ నుండి జూన్ వరకు) లో భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి రేటుతో బలమైన పనితీరును కనబరిచింది. ఈ గణాంకాలు రాబోయే నెలల్లో కూడా వృద్ధి వేగం కొనసాగవచ్చనే ఆశాభావాన్ని రేకెత్తిస్తున్నాయి.