INDIA: "భారత్ ఫ్యూచర్ సిటీ" ఇన్‌వెస్ట్‌మెంట్ హాట్ స్పాట్
రియల్ ఎస్టేట్ మళ్లీ చలనం!.. రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ పైకి... పెరుగుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్య.. 2025లో రూ.3,381 కోట్ల దాటిన ప్రభుత్వ ఆదాయం
గత రెండేళ్లుగా స్తబ్ధుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో మళ్లీ చలనం మొదలైంది. 2023 నవంబర్‌లో అసెంబ్లీ, 2024లో లోక్‌సభ ఎన్నికలు, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం వంటి కారణాలతో పాటు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల వల్ల భూముల క్రయవిక్రయాలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల రిజిస్ట్రేషన్ల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం రియల్ రంగానికి కొంత ఊరటనిస్తోంది.
రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరుగుదల
రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ విభాగం అధికారుల గణాంకాల ప్రకారం, భూముల క్రయవిక్రయాలు, తద్వారా ప్రభుత్వానికి సమకూరే ఆదాయం పెరుగుతోంది. 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు జిల్లా వ్యాప్తంగా 2,48,189 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.3,893.26 కోట్ల ఆదాయం వచ్చింది. 2024లో రిజిస్ట్రేషన్లు స్వల్పంగా తగ్గి 2,41,297 డాక్యుమెంట్లు కాగా, ఆదాయం మాత్రం రూ.3,911.87 కోట్లకు పెరిగింది. ఇక, 2025 జనవరి నుంచి అక్టోబర్ 20 వరకు (పది నెలల్లో) 1,98,766 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, అప్పటికే ప్రభుత్వానికి రూ.3,381.12 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ పెరుగుదల రియల్టీ రంగం పుంజుకుంటున్నదనేందుకు నిదర్శనం. ముఖ్యంగా, గత ఏడాదితో పోలిస్తే ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగడం మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడటాన్ని సూచిస్తుంది.
రాయదుర్గం వేలం: రియల్టర్లలో కొత్త ఉత్సాహం
ఇటీవల హెచ్‌ఎండీఏ నిర్వహించిన రాయదుర్గం భూముల వేలం రియల్ ఎస్టేట్ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బహిరంగ మార్కెట్లో ఎకరం ధర ఏకంగా రూ.177 కోట్లు పలకడం (కొన్ని పార్శిళ్లకు రూ.200 కోట్ల మార్కును కూడా దాటే అవకాశం ఉందని అంచనా) జిల్లాపై రియల్ సంస్థలు మళ్లీ దృష్టి సారించడానికి ప్రధాన కారణంగా నిలిచింది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం కారణంగా పెట్టుబడులకు వెనుకాడిన సంస్థలు, తాజా వేలంతో తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. ఈ వేలం ద్వారా రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.
భారత్ ఫ్యూచర్ సిటీ’తో భారీ అంచనాలు
రాయదుర్గం వేలంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'భారత్ ఫ్యూచర్ సిటీ' రియల్ రంగానికి సువర్ణావకాశంగా మారింది. మీర్ఖాన్పేట కేంద్రంగా 30 వేల ఎకరాల్లో సుమారు 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రూపొందుతున్న ఈ నెట్-జీరో స్మార్ట్ సిటీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. ఈ సిటీని నివాస, వాణిజ్య, పరిశ్రమలు, వినోదం, గ్రీన్ జోన్లుగా విభజించారు. ప్రతిష్టాత్మక 550 బడా కంపెనీలను ఇక్కడికి తీసుకురావడమే లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించడం, దీనికి అనుగుణంగా రేడియల్ రోడ్లు, రింగ్ రోడ్లకు భూ సేకరణ ప్రక్రియ చేపట్టి, పనులకు శంకుస్థాపనలు చేయడంతో ఈ ప్రాంత భూముల కొనుగోళ్లకు వ్యాపారులు, సాధారణ ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఔటర్ రింగురోడ్డు మీదుగా భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు డీపీఆర్ సిద్ధం చేయడం ఈ ప్రాంత అభివృద్ధికి తిరుగులేని సంకేతాన్ని ఇచ్చింది.