Indian Economy : ప్రపంచం ఆగినా భారత్ ఆగదు..ఆర్‌బీఐ లెక్క ప్రకారం మనమే గ్లోబల్ గ్రోత్ ఛాంపియన్.

Update: 2026-01-22 06:15 GMT

Indian Economy : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, ముఖ్యంగా అమెరికా ప్రభుత్వం భారత వస్తువులపై విధిస్తున్న భారీ సుంకాల నేపథ్యంలో ఆర్‌బీఐ విడుదల చేసిన తాజా నివేదిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉండబోతోందని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీసు, ఆర్‌బీఐ అంచనా వేశాయి. ఇది గత ఏడాది నమోదైన 6.5 శాతం కంటే మెరుగైనది. వెనిజులాలో అమెరికా జోక్యం, గ్రీన్‌ల్యాండ్ విషయంలో నెలకొన్న వివాదాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ, భారత్ తన వృద్ధి వేగాన్ని కొనసాగించడం గమనార్హం.

ఈ వృద్ధికి ప్రధాన కారణం దేశీయంగా పెరుగుతున్న డిమాండ్. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం మళ్ళీ పుంజుకుంది. పట్టణ ప్రాంతాల్లో కూడా కొనుగోళ్లు నిలకడగా ఉన్నాయి. మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టార్‌లలో కనిపిస్తున్న జోరు జీవీఏ పెరుగుదలకు తోడ్పడుతోంది. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ నివేదికను రూపొందించింది. ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితి భవిష్యత్తుపై గట్టి నమ్మకాన్ని కలిగిస్తోందని వారు పేర్కొన్నారు.

అమెరికా విధిస్తున్న సుంకాలకు వ్యతిరేకంగా భారత ఎగుమతిదారులు తమ వ్యూహాన్ని మార్చుకున్నారు. కేవలం అమెరికాపైనే ఆధారపడకుండా తమ ఎగుమతులను ఇతర దేశాలకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం భారత్ ఐరోపా సమాఖ్య, గల్ఫ్ దేశాలతో సహా సుమారు 50 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోంది. ఇటీవలే న్యూజిలాండ్, ఓమాన్‌లతో వాణిజ్య ఒప్పందాలను పూర్తి చేసుకోవడం ఒక గొప్ప విజయమని నివేదిక వెల్లడించింది. దీనివల్ల బాహ్య రంగం నుంచి ఎదురయ్యే ముప్పులను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది.

మరోవైపు, దేశంలో ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. నవంబర్‌లో 0.7 శాతంగా ఉన్న సీపీఐ ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 1.3 శాతానికి చేరినప్పటికీ, ఇది ఆర్‌బీఐ నిర్ణయించిన కనీస పరిమితి లోపే ఉంది. ఆహారేతర రంగాల్లో రుణ పరపతి పెరగడం, బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ రంగాల నుంచి నిధుల ప్రవాహం సాఫీగా సాగడం వల్ల ఆర్థిక వ్యవస్థకు కావాల్సిన ఊతం లభిస్తోంది. మొత్తానికి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కునారిల్లుతున్న వేళ, భారత్ మాత్రం ఆశాకిరణంగా నిలుస్తోందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

Tags:    

Similar News