Car Exports : మారుతీ, టయోటా దెబ్బకు గ్లోబల్ మార్కెట్ షేక్.. ఎగుమతుల్లో మన కార్లే టాప్.
Car Exports : విదేశీ రోడ్లపై మేడ్ ఇన్ ఇండియా కార్లు దూసుకుపోతున్నాయి. భారత ఆటోమొబైల్ రంగం 2026 ఏడాదిని అదిరిపోయే రికార్డుతో ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ వాహనాలకు డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో, ఎగుమతుల్లో భారీ వృద్ధి నమోదైంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. జనవరి 2026లో వాహనాల ఎగుమతులు ఏకంగా 33.4 శాతం పెరిగాయి. గతేడాది జనవరిలో 57,585 వాహనాలు విదేశాలకు వెళ్లగా, ఈ ఏడాది ఆ సంఖ్య 76,822కు చేరడం విశేషం.
వివిధ రకాల వాహన విభాగాల్లో ప్యాసింజర్ వెహికల్స్ సెగ్మెంట్ టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది. జనవరి 2026లో మొత్తం 37,329 ప్యాసింజర్ కార్లు విదేశీ తీరాలకు చేరాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ విభాగంలో 43.6 శాతం పెరుగుదల కనిపించింది. ఇక భారతీయులకు ఇష్టమైన యూటిలిటీ వెహికల్స్ కూడా విదేశీయులను ఆకట్టుకుంటున్నాయి. ఈ విభాగంలో ఎగుమతులు 26.1 శాతం పెరిగి 38,421 యూనిట్లకు చేరుకున్నాయి. కేవలం వ్యాన్ల విభాగంలో తప్ప, మిగిలిన అన్ని రకాల కార్ల ఎగుమతుల్లో భారత్ జెండా పాతింది.
భారత్ నుంచి ఎగుమతి అవుతున్న కార్లలో కొన్ని మోడల్స్ విదేశీయుల మనసు గెలుచుకుంటున్నాయి. టయోటా నుంచి వస్తున్న హైరైడర్ 5,164 యూనిట్లతో ఎగుమతుల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇక మారుతీ సుజుకీకి చెందిన జిమ్నీ, కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ కారు ఈ-విటారా కూడా విదేశీ మార్కెట్లలో సంచలనం సృష్టిస్తున్నాయి. వీటితో పాటు మహీంద్రాకు చెందిన XUV 3XO ఎగుమతులు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. మారుతీ ఫ్రాంక్స్ ఎగుమతులు కొంచెం తగ్గినప్పటికీ, ఓవరాల్‌గా భారతీయ బ్రాండ్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది.
కమర్షియల్ వాహనాల విభాగంలోనూ భారత్ తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా మహీంద్రా స్కోర్పియో పిక్-అప్ వాహనాలకు విదేశాల్లో మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఇండోనేషియాకు చెందిన ఒక ప్రభుత్వ రంగ సంస్థ నుంచి మహీంద్రాకు ఏకంగా 35,000 యూనిట్ల భారీ ఎగుమతి ఆర్డర్ రావడం ఒక మైలురాయిగా నిలిచింది. భారత ఆటోమొబైల్ చరిత్రలో ఒక విదేశీ సంస్థ నుంచి వచ్చిన అతిపెద్ద ఎగుమతి ఒప్పందంగా దీనిని పరిగణిస్తున్నారు. ఇది భారతీయ తయారీ సామర్థ్యంపై ప్రపంచ దేశాలకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.
కేవలం ధర మాత్రమే కాకుండా, నాణ్యత, అత్యాధునిక ఫీచర్ల విషయంలో కూడా భారతీయ కార్లు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉంటున్నాయి. ఆఫ్రికా, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా దేశాల్లో భారతీయ బ్రాండ్ల జోరు పెరుగుతోంది. 2026 ఆరంభంలోనే ఇంతటి భారీ వృద్ధి నమోదు కావడం చూస్తుంటే, ఈ ఏడాది అంతా భారత ఆటోమొబైల్ రంగం ఎగుమతుల్లో కొత్త శిఖరాలను తాకడం ఖాయంగా కనిపిస్తోంది.