EV Exports : విదేశాల్లో మన ఎలక్ట్రిక్ స్కూటర్ల జైత్రయాత్ర..సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన టీవీఎస్, ఏథర్.

Update: 2025-12-31 06:41 GMT

EV Exports : మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు విదేశీ వీధుల్లోనూ రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. భారతీయ ద్విచక్ర వాహన రంగం ఎగుమతుల్లో సత్తా చాటుతుండగా, అందులో ఎలక్ట్రిక్ వాహనాల వాటా కూడా క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మన దేశానికి చెందిన టీవీఎస్, ఏథర్ స్కూటర్లకు విదేశాల్లో విపరీతమైన క్రేజ్ పెరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఎగుమతుల్లో ఎగిసిపడుతున్న గ్రాఫ్: ఏప్రిల్ నుండి నవంబర్ 2025 వరకు భారతీయ ద్విచక్ర వాహన ఎగుమతులు 24 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇందులో ఎలక్ట్రిక్ విభాగం తనదైన ముద్ర వేసింది. గత ఎనిమిది నెలల్లో మొత్తం 5,536 ఎలక్ట్రిక్ స్కూటర్లు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఎగుమతి అయిన మొత్తం ఈవీలలో 93 శాతం వాటా కేవలం టీవీఎస్ మోటార్స్ మరియు ఏథర్ ఎనర్జీ కంపెనీలదే కావడం విశేషం. మన దేశంలో తయారైన టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనం.

ఎగుమతుల రేసులో టీవీఎస్ మోటార్ కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్-నవంబర్ మధ్య టీవీఎస్ ఏకంగా 2,810 ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎగుమతి చేసింది. ఇందులో ఐక్యూబ్ మోడల్ ఎగుమతులు ఏడాది కాలంలో 225 శాతం పెరిగాయి. ఇక బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ ఏథర్ ఎనర్జీ కూడా తక్కువ కాలంలోనే ప్రపంచ మార్కెట్‌ను ఆకర్షించింది. ఏథర్ తన 450X మోడల్ ఎగుమతుల్లో 307 శాతం వృద్ధిని సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. విదేశీ వినియోగదారులు ఏథర్ స్మార్ట్ ఫీచర్లకు ఫిదా అవుతున్నారు.

కేవలం ఎగుమతులే కాదు, దేశీయంగా కూడా ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. జనవరి నుంచి నవంబర్ 2025 మధ్య దేశంలో సుమారు 11.8 లక్షల ఎలక్ట్రిక్ టూ వీలర్లు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 10 శాతం వృద్ధి. మొత్తం 2025 ఏడాది ముగిసే సమయానికి ఈ సంఖ్య 13 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, గతేడాది ఉన్న 30 శాతం వృద్ధి రేటు ఈసారి 13 శాతానికి పడిపోయింది. మార్కెట్ పెరిగే కొద్దీ ఈ వృద్ధి రేటులో సహజంగానే కొంత మందగింపు కనిపిస్తోంది.

ఎలక్ట్రిక్ టూ వీలర్ల విభాగం జోరుగా ఉన్నప్పటికీ మొత్తం టూ వీలర్ మార్కెట్లో ఈవీల వాటా మాత్రం 6 శాతంగానే ఉంది. దీనికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జీఎస్టీ 2.0 తర్వాత పెట్రోల్ బండ్లకూ, ఎలక్ట్రిక్ బండ్లకూ మధ్య ధరల వ్యత్యాసం తగ్గడం ఒక కారణమైతే.. బ్యాటరీల తయారీకి వాడే ముడి సరుకుల కొరత వల్ల సరఫరాలో ఇబ్బందులు కలగడం మరొక కారణం. అయినప్పటికీ, భవిష్యత్తు మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలదేనని విదేశీ ఎగుమతుల పెరుగుదల స్పష్టం చేస్తోంది.

Tags:    

Similar News