Indian Whisky : ప్రపంచాన్ని ఊపేస్తున్న ఇండియన్ విస్కీ..విదేశీ బ్రాండ్ల పని ఖతం.

Update: 2026-01-22 05:30 GMT

Indian Whisky : ఒకప్పుడు ప్రీమియం విస్కీ అంటే కేవలం విదేశీ బ్రాండ్లు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. భారతీయ సింగిల్ మాల్ట్ విస్కీలు ప్రపంచ స్థాయి బార్లలోనూ, మద్యం దుకాణాల్లోనూ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. క్వాలిటీ, క్లాస్ విషయంలో అంతర్జాతీయ బ్రాండ్లకే మన విస్కీలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక అవార్డులను కొల్లగొడుతూ, భారతీయ బ్రాండ్లు ఇప్పుడు గ్లోబల్ కింగ్స్‎గా అవతరించాయి.

భారతీయ మద్యపాన మార్కెట్లో ఇప్పుడు ఒక నిశ్శబ్ద విప్లవం కొనసాగుతోంది. కేవలం పేరు కోసమే కాకుండా, నాణ్యతలోనూ తిరుగులేదని మన సింగిల్ మాల్ట్ విస్కీలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా దేవాన్స్ జ్ఞాన్‌చంద్ ఆడంబర, మషా వంటి బ్రాండ్లు లాస్ వేగాస్, జర్మనీల్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో బెస్ట్ ఇండియన్ విస్కీ, ఇంటర్నేషనల్ విస్కీ ఆఫ్ ది ఇయర్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నాయి. ఈ బ్రాండ్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ స్పిరిట్స్ విభాగంలో భారత్ జెండాను ఎగురవేస్తున్నాయి.

మరోవైపు, ఇంద్రీ-త్రిణి ద్రు అనే బ్రాండ్ తన కాస్క్-స్ట్రెంత్ ప్రొఫైల్‌తో విదేశీయులను ఫిదా చేస్తోంది. మయామి గ్లోబల్ స్పిరిట్ అవార్డ్స్ 2025లో ఇది బెస్ట్ వరల్డ్ విస్కీ‎గా నిలిచింది. అలాగే, గోవా నుంచి వచ్చిన పాల్ జాన్ బ్రాండ్ ఇప్పటికే ది గ్రేట్ ఇండియన్ సింగిల్ మాల్ట్‎గా పేరు తెచ్చుకుని, సాన్ ఫ్రాన్సిస్కో వరల్డ్ స్పిరిట్స్ పోటీల్లో డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించింది. రాజస్థాన్ మట్టి పరిమళాలతో వచ్చే గోదావన్ విస్కీ ఏకంగా 85కు పైగా అంతర్జాతీయ అవార్డులను తన ఖాతాలో వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

భారతీయ ఆల్కహాల్ మార్కెట్ గణాంకాలు చూస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ మార్కెట్ ఆదాయం సుమారు 5.3 లక్షల కోట్ల రూపాయలకు (62 బిలియన్ డాలర్లు) చేరుకుంటుందని అంచనా. పట్టణీకరణ పెరగడం, ప్రజల ఆదాయం పెరగడం, ప్రీమియం ఉత్పత్తుల పట్ల యువత మొగ్గు చూపడం వల్ల ఈ రంగం 8-10 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ముఖ్యంగా 1,000 రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ మద్యం అమ్మకాలు 15 శాతం పెరుగుతున్నాయి. అంటే జనం క్వాంటిటీ కంటే క్వాలిటీకే ఓటు వేస్తున్నారు.

ప్రస్తుతం భారతీయ మద్యం మార్కెట్లో 65-70 శాతం వాటా స్పిరిట్స్ (విస్కీ, రమ్, జిన్) దే కాగా, మిగిలిన వాటా బీర్, వైన్‌లది. అయితే, వివిధ రాష్ట్రాల్లో ఉండే వేర్వేరు నిబంధనలు, పన్నుల భారంతో పాటు ముడి సరుకుల ధరల హెచ్చుతగ్గులు ఈ పరిశ్రమకు సవాల్‌గా మారుతున్నాయి. అయినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లను శాసిస్తున్న భారతీయ బ్రాండ్లు భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం. భారతీయ విస్కీలు ఇప్పుడు కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, ప్రపంచ వేదికపై దేశ గౌరవాన్ని చాటే బ్రాండ్లుగా మారాయి.

Tags:    

Similar News