Gold : భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, కష్టకాలంలో ఆదుకునే ఆస్తి, సంప్రదాయానికి చిహ్నం కూడా. అందుకే ప్రపంచంలో అత్యధికంగా బంగారం కలిగి ఉన్న దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆర్థిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, భారతీయ కుటుంబాల వద్ద ఉన్న మొత్తం బంగారం విలువ అక్షరాలా దేశ ఆర్థిక వ్యవస్థతో సమానంగా ఉందని తేలింది. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం.. భారతీయ కుటుంబాల వద్ద ఉన్న మొత్తం బంగారం విలువ $3.8 ట్రిలియన్లుగా ఉంది. ఈ మొత్తం విలువ, భారతదేశ ప్రస్తుత స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 88.8 శాతంకు సమానం. అంటే, భారతీయుల వద్ద ఉన్న బంగారం నిల్వలు దేశ ఆర్థిక వ్యవస్థ సైజుకు దాదాపు సమానం.
కేంద్ర ప్రభుత్వం పరోక్ష, ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ, ఆదాయపు పన్నులను గణనీయంగా తగ్గించడం వల్ల ప్రజల వద్ద ఆదా పెరిగిందని, ఇది బంగారాన్ని కొనుగోలు చేయడానికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చిందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక పేర్కొంది. సాధారణ కుటుంబాలే కాకుండా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా తన బంగారాన్ని నిరంతరం పెంచుకుంటోంది. 2024 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఆర్‌బీఐ ఏకంగా 75 టన్నుల బంగారం కొనుగోలు చేసింది.
ప్రస్తుతం ఆర్‌బీఐ విదేశీ మారక నిల్వల్లో మొత్తం బంగారం నిల్వలు 880 టన్నులకు పెరిగాయి. విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా ఇప్పుడు 14 శాతంగా ఉంది. మోర్గాన్ స్టాన్లీ నివేదికలో భారతీయుల పెట్టుబడి అలవాట్లపై మరో ముఖ్యమైన అంశం వెలుగులోకి వచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ కుటుంబాల ఆదాలో 15.1 శాతం ఈక్విటీలు లేదా స్టాక్‌లలో పెట్టుబడి పెట్టబడింది. అంతకు ముందు సంవత్సరం ఇది కేవలం 8.7 శాతం మాత్రమే. ఒకే సంవత్సరంలో ఇది దాదాపు రెట్టింపు కావడాన్ని బట్టి చూస్తే, ప్రజలు స్టాక్ మార్కెట్ వైపు ఎంతగా ఆకర్షితులవుతున్నారో అర్థమవుతుంది.
అదే సమయంలో సామాన్యుల సాంప్రదాయ పెట్టుబడి మార్గమైన ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి తగ్గుతోంది. 2023-24లో భారతీయ కుటుంబాల ఆదాలో డిపాజిట్ల వాటా 40 శాతం ఉండగా, 2024-25లో అది 35 శాతానికి తగ్గిపోయింది.