India Forex Reserves : రెండు వారాలుగా భారీగా తగ్గిపోతున్న భారత ఫారెక్స్ రిజర్వ్.. కారణం ఇదే.
India Forex Reserves : భారతదేశం, పాకిస్తాన్ విదేశీ మారక నిల్వల పరిస్థితికి సంబంధించిన తాజా గణాంకాలు విడుదలయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అక్టోబర్ 3తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు స్వల్పంగా తగ్గాయి, కానీ ఇప్పటికీ భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి. మరోవైపు, పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ నిల్వలు కొద్దిగా పెరిగాయి. రెండు దేశాల విదేశీ మారక నిల్వల ప్రస్తుత పరిస్థితి, భారత్‌లో తగ్గుదలకు గల కారణాలు, పాకిస్తాన్‌తో పోలిస్తే భారత ఆర్థిక బలం ఎంత ఉందనే వివరాలను ఇక్కడ చూద్దాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, అక్టోబర్ 3తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక నిల్వలు 276 మిలియన్ అమెరికన్ డాలర్లు తగ్గి 699.96 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గతవారం కూడా ఈ నిల్వలు 2.334 బిలియన్ డాలర్లు తగ్గి 700.236 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇలా వరుసగా రెండో వారమూ దేశ ఫారెక్స్ నిల్వల్లో క్షీణత నమోదైంది. ఈ తగ్గుదలకు ప్రధానంగా విదేశీ కరెన్సీ ఆస్తులు తగ్గడం కారణమని ఆర్‌బీఐ తెలిపింది.
ఈ వారంలో విదేశీ మారక నిల్వలలో అతిపెద్ద భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 4.049 బిలియన్ అమెరికన్ డాలర్లు తగ్గి 577.708 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారత్ ఫారెక్స్ నిల్వల్లో కేవలం అమెరికన్ డాలర్లే కాకుండా యూరో, పౌండ్ స్టెర్లింగ్, యెన్ వంటి ఇతర దేశాల కరెన్సీలు కూడా ఉంటాయి. డాలర్‌తో పోలిస్తే ఈ ఇతర కరెన్సీల విలువ పెరిగినా లేదా తగ్గినా, దాని ప్రభావం విదేశీ కరెన్సీ ఆస్తుల పై కనిపిస్తుంది. అయితే, ఈ రివ్యూ వీక్ లో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDR) 2.5 కోట్ల డాలర్లు స్వల్పంగా పెరిగి 18.814 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
విదేశీ మారక నిల్వల్లో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, భారత్ బంగారం నిల్వలు మాత్రం భారీగా పెరిగాయి. అక్టోబర్ 3తో ముగిసిన వారంలో గోల్డ్ రిజర్వ్ 3.753 బిలియన్ డాలర్లు పెరిగి 98.77 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. అలాగే, అంతర్జాతీయ ద్రవ్య నిధి వద్ద దేశ రిజర్వ్ నిల్వలు మాత్రం 40 లక్షల డాలర్లు స్వల్పంగా తగ్గి 4.6669 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ చిన్నపాటి హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, భారత్ ప్రపంచంలో అత్యధిక విదేశీ మారక నిల్వలు కలిగిన దేశాలలో ఒకటిగా పటిష్టమైన స్థానాన్ని కొనసాగిస్తోంది.
భారత్‌తో పోలిస్తే, పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు కూడా స్వల్పంగా పెరిగాయి. గురువారం విడుదలైన పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ తాజా గణాంకాల ప్రకారం అక్టోబర్ 3, 2025 నాటికి పాకిస్తాన్ ఫారెక్స్ రిజర్వ్ 20 మిలియన్ డాలర్లు పెరిగి మొత్తం 14.42 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత వారంలో కూడా పాకిస్తాన్ నిల్వలు 2.1 కోట్ల డాలర్లు పెరిగాయి.