Indigo Crisis : విమానం ఎక్కాలంటే బంగారం తాకట్టు పెట్టాల్సిందే..రూ.31,000కు చేరిన ఢిల్లీ-ముంబై టికెట్.
Indigo Crisis : భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగోలో ఇటీవల లక్షలాది మంది ప్రయాణికులు విమానాల జాప్యం, రద్దు సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం పైలట్ల కొరత. గత 4-5 రోజులుగా ప్రతిరోజూ 100కు పైగా విమానాలు రద్దు అవుతుండగా బుధవారం (డిసెంబర్ 3) ఒక్కరోజే 200కు పైగా విమానాలను రద్దు చేశారు. కొన్ని విమానాలు ఏకంగా 10 గంటల వరకు ఆలస్యంగా నడిచాయి. ఈ కారణంగా దేశీయ విమానయాన టికెట్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి.
ప్రతి మూడు రోజులకు పది లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న ఇండిగో సంస్థలో నెలకొన్న ఈ గందరగోళం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న ఆగ్రహం నేపథ్యంలో ఏవియేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ గురువారం (డిసెంబర్ 4) ఈ మొత్తం సమస్యపై ఎయిర్‌లైన్ సీనియర్ మేనేజ్‌మెంట్‌ను వివరణ కోరింది.ఈ సమస్యను పరిష్కరించడానికి తక్షణమే ఒక సమగ్ర ప్రణాళికతో రావాలని కూడా ఇండిగోను ఆదేశించింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. మంగళవారం (డిసెంబర్ 2) ఇండిగో సమయానికి విమానాల నిర్వహణ (On-Time Performance) కేవలం 35% మాత్రమే. ఇది భారతదేశంలోని అన్ని షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్స్‌లోకెల్లా అత్యంత తక్కువ. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఇండిగో బుధవారం సాయంత్రం నుంచే విమానాల సంఖ్యను తగ్గించడం వంటి కొన్ని చర్యలను ప్రారంభించింది. నవంబర్‌లో ఇండిగో రద్దు చేసిన 1,232 విమానాలలో దాదాపు 62 శాతం విమానాలు కేవలం సిబ్బంది (పైలట్లు/క్రూ) కొరత కారణంగానే రద్దు అయ్యాయి.
కాక్‌పిట్ సిబ్బంది అలసటపై వచ్చిన తీవ్ర ఫిర్యాదుల తర్వాత, DGCA నవంబర్ 1 నుంచి మరింత కఠినమైన సిబ్బంది డ్యూటీ రూల్స్ అమలులోకి తెచ్చింది. దీనివల్ల పైలట్ల అవసరం పెరిగింది. ఈ కొత్త నిబంధనలను పాటించడానికి ఇండిగో ప్రస్తుతం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు 62% రద్దు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇండిగో ఆన్-టైమ్ పర్ఫార్మెన్స్ అక్టోబర్ 2025లో 84.1% ఉండగా గత నెలలో అది 67.7% కి పడిపోయింది.
ఇండిగో విమానాల్లో కోత మరియు అనిశ్చితి కారణంగా డొమెస్టిక్ రూట్లలో విమాన టికెట్ల ధరలు అమాంతం పెరిగాయి. శుక్రవారం, శనివారం (డిసెంబర్ 5 & 6) కోసం ఢిల్లీ నుంచి బెంగళూరుకు ఎకానమీ క్లాస్ వన్-వే (నాన్‌స్టాప్) టికెట్ ధర రూ.11,000 నుంచి రూ.43,145 వరకు పలికింది. ఢిల్లీ-ముంబై రూట్‌లో టికెట్ ధర రూ.18,000 నుంచి రూ.31,000 వరకు పెరిగింది. ముంబై-కోల్‌కతా మార్గంలో కూడా ధర రూ.8,000 నుంచి రూ.19,000 మధ్య ఉంది.